Bihar Elections | త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) జరగనున్న బీహార్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పార్టీల్లో ఉత్సాహం పెరిగింది. ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంలో బిజీగా మారిపోయాయి. ఈ క్రమంలో బీజేపీ (BJP) సైతం గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ (Maithili Thakur)ని బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.
దర్భంగా ప్రాంతంలోని అలీఘర్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. బీహార్ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందు మైథిలి ఠాకూర్.. బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్‌లను కలిశారు. మైథిలి ఠాకూర్‌తో భేటీ అయిన విషయాన్ని వినోత్ తావ్డే ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ మేరకు ఫొటోలను కూడా పోస్టు చేశారు. లాలూ యాదవ్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని వీడిన మైథిలి కుటుంబం.. నీతీశ్ పాలనలో పురోగతి చూసి బీహార్‌కు తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ పోస్టుకు మైథిలి స్పందించారు. ‘బీహార్ అభివృద్ధి కోసం కలలుకనే వ్యక్తులను కలుసుకున్నాను. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మైథిలి ఠాకూర్ పోటీ చేయనున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. మైథిలికి రెండు స్థానాలను బీజేపీ ఆఫర్ చేసినట్లు సమాచారం. దర్బంగాలోని మధుబని (Madhubani), అలీఘర్.. ఈ రెండింట్లో ఏదో ఒక స్థానం నుంచి మైథిలి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి దశ నవంబర్ 6, రెండో దశ నవంబర్ 11 తేదీల్లో జరగనున్నాయి. అదేనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేయనున్నారు.
Also Read..
Rare Earth Minerals: అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేసిన పాకిస్థాన్
పిల్లలు గుహలో ఉంటే మీరేం చేస్తున్నట్లు?