తాండూరు, ఫిబ్రవరి 23 : తాండూరులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ వేసినప్పటి నుంచే పలు రకాలుగా దౌర్జన్యాలకు దిగారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. తాండూరులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తుందన్న సమాచారంతోనే కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడి ఎన్నికల్లో అక్రమంగా విజయం చేజిక్కించుకున్నారన్నారు. అడుగడుగునా అధికార దుర్వియోగం చేశారని విమర్శించారు. రిజర్వేషన్లు ఖరారైన సమయంలో కాంగ్రెస్ వారికి అభ్యర్థులు కూడా దొరకని తరుణంలో బీఆర్ఎస్ నుంచి పోటీకి దిగిన అభ్యర్థులను బెదిరించి భయభ్రాంతులకు లోను చేశారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులతోపాటు పట్టణంలోని వ్యాపారులు, చివరకు ప్రజలను కూడా బెదిరించాన్నారు. దీన్ని తట్టుకోలేక కొందరు వ్యాపారులు పోలింగ్ సమయానికి తీర్థయాత్రలకు వెళ్లారని పేర్కొన్నారు. ఎన్నికల రోజు ప్రచారం ముగిసినప్పటి నుంచి ప్రతి వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పలు రకాలుగా అడ్డంకులు సృష్టించారన్నారు. పైగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తీరును తట్టుకోలేక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తన అనుచరులను బీఆర్ఎస్ పార్టీవారిపై దౌర్జన్యాలకు పురమాయించారని ఆగ్రహించారు. పోలింగ్ రోజున కాంగ్రెస్ నాయకుల తీరును పట్టణ ప్రజలు గమనించారన్నారు.
కర్ణాటకలోని చితాపూర్ తదితర ప్రాంతాల నుంచి బోగస్ ఓటర్లను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించారని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థిని, ఆయన ఏజెంటును మాత్రమే అనుమతించాల్సి ఉండగా.. అలాగే కౌంటింగ్ రోజు ఇంకా ఐదు వార్డుల ఫలితాలు ప్రకటించక ముందే.. బ్యాలెట్ డబ్బాలు తరలించే వరకు ఎవరినీ అనుమతించడానికి వీలు లేకున్నా ఫలితాలను తారుమారు చేసేందుకు ఎమ్మెల్యే 30 మంది అనుచరులతో కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లడం ఎన్నికల నిబంధనలు విస్మరించడమేనని స్పష్టం చేశారు. పోలీసులూ ఈ విషయంలో మిన్నకుండా ఉండిపోయారని విమర్శించారు.
రెండో వార్డుకు చెందిన ఫలితాల్లో 24 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారని ప్రకటించిన అధికారులు.. ఆ తరువాత ఎమ్మెల్యే కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లిన సమయంలో రీకౌంటింగ్ పెట్టించి 220 ఓట్ల తేడాతో కాంగ్రెస్ గెలిచినట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయమై అడిగేందుకు తాము వెళితే.. అడ్డుకున్నామని, ఎన్నికల నిబంధనలు విస్మరించారని కేసులు పెట్టించారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్న ఉద్దేశంతోనే తాము కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు ప్రయత్నించామన్నారు. అంతేతప్ప ఎన్నికల విధులకు తాము ఏ అధికారిని కాని, పోలీసులనుకాని ఇబ్బందులు పెట్టలేదన్నారు. తాండూరులో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులపై ఉద్దేశపూర్వకంగా తాము ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడలేదన్నారు. తోపులాట జరిగిన సమయంలో పోలీస్ అధికారులకు ఏవైనా ఇబ్బందులు కలిగినట్లయితే తాము క్షమాపణ చెబుతున్నట్లు చెప్పారు. పోలీసులు, అధికారులు అధికార పార్టీకి దాసోహం కావద్దన్నారు. అధికార పార్టీవారు రీ కౌంటింగ్ చేయమంటే క్షణాల్లో రీకౌంటింగ్ చేసిన అధికారులు.. బీఆర్ఎస్ పార్టీ వారు కోరితే మాత్రం పట్టించుకోలేదన్నారు. అక్రమాలు, అరాచకాలకు పాల్పడినవారిని వదిలి, న్యాయం కోసం నిలదీసిన బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయడమేంటని ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింహులు, సిద్దిరాల శ్రీనివాస్, మండలాల అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, నర్సిరెడ్డి, యుగేందర్‌గౌడ్ పాల్గొన్నారు.