హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : సంక్షేమ గురుకులాల బలోపేతంలో భాగంగా టీజీ ఆన్లైన్ డిజిటల్ వేదిక రూపొందిస్తున్నామని ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ కృష్ణఆదిత్య సోమవారం మీడియాతో పేర్కొన్నారు. గురుకుల విద్యాసంస్థల కోసం టీజీ ఆన్లైన్ సమగ్ర డిజిటల్ వేదికను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సదరు పోర్టల్లో 24 సమగ్ర మాడ్యూల్స్ ఉంటాయని, రాష్ట్రవ్యాప్తంగా 5లక్షలకుపైగా విద్యార్థుల విద్య, అకాడమిక్, ఆరోగ్య సంబంధిత వివరాలు అందుబాటులో ఉంటాయని, తద్వారా కేంద్రీకృత పర్యవేక్షణ, డాటా ఆధారిత పాలన, మెరుగైన సేవలు అందించగలమని తెలిపారు.
ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 268 గురుకులాలు ఉన్నాయని, 79 గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, శాశ్వత భవనాల కోసం ప్రతి సంస్థకు రూ.50 కోట్లు కేటాయించే ప్రతిపాదన ఉందని తెలిపారు. సొసైటీ ఆధ్వర్యంలో బీఈడీ, ఫార్మసీ కోర్సులతోపాటు 5 ప్రొఫెషనల్ కళాశాలలను స్థాపించే ప్రతిపాదన సిద్ధం చేశామని తెలిపారు. టీజీసెట్ ఫలితాలను మార్చి 9న విడుదల చేస్తున్నామని, 492 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తే కేవలం రెండు చోట్ల మాత్రమే ఆలస్యమైందని స్పష్టంచేశారు.