KCR | నల్లబెల్లిలో పెద్ది ఇంటికి వెళ్తుండగా తోడుగా జనం భారీగా వచ్చిన గులాబీ శ్రేణులు, అభిమానులు దారిపొడవునా.. జననేతకు పలుకరింపు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి యాదిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటనీరు పెట్టుకొన్నారు. పెద్ది పిల్లలను అకున చేర్చుకొని దుఃఖపడ్డారు. ఉద్యమ సహచరుడిని, ఆత్మీయుడిని కోల్పో యానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నోట మాట రాక మౌనముద్రలోకి వెళ్లిపోయారు. పార్టీ శ్రేణులు, అభిమానుల నినాదాల నడుమ పెద్ది చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం సుదర్శన్‌రెడ్డి భార్య స్వప్న, కొడుకు నిదర్శన్‌రెడ్డి, కూతురు ధర్మిష్ట, తల్లి అమృతమ్మను ఓదారుస్తున్న కేసీఆర్.
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తేతెలంగాణ)/వరంగల్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/యాదగిరిగుట్ట: ఉద్యమ సహచరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అకాల మరణంతో శోకతప్త హృదయులైన వారి భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు నల్లబెల్లికి బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అడుగడుగునా జనం సంఘీభావం పలికారు. ఆదివారం మధ్యాహ్నం ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లిన ఆయనకు దారి పొడవునా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. కేసీఆర్‌తో కలిసి సుదర్శన్‌రెడ్డికి నివాళులర్పించేందుకు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. దారి మధ్యలో తన కాన్యాయ్‌ను ఆపి అధైర్యపడొద్దు.. అండగా ఉంటానని అభయమిస్తూ.. కార్యకర్తలను అనునయిస్తూ.. అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు కదిలారు.
తిరుగు పయనంలోనూ ఆయనను చూసేందుకు చౌరస్తాల వద్ద పెద్దసంఖ్యలో కార్యకర్తలు గూమిగూడటం కనిపించింది. వరంగల్ జిల్లాలోని జనగామ, హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల దారులకు ఇరువైపులా ఎక్కడ చూసినా జనసందోహమే కనిపించింది. కేసీఆర్ కాన్వాయికి వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా సాధారణ ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడి కారులో కేసీఆర్ కనిపించగానే ఉద్యమస్ఫూర్తిని చాటారు. నల్లబెల్లికి విచ్చేస్తున్న కేసీఆర్‌కు దారిలో కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు కూడా నర్సంపేట దిశగా తరలివచ్చారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని బాహుపేట స్టేజీ వద్ద ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపారు. కేసీఆర్ తన వాహనాన్ని బాహుపేట స్టేజీ వద్ద సుమారు అరనిమిషం నిలిపి అక్కడే వేచి ఉన్న గొంగిడి సునీత, మహేందర్‌రెడ్డిని పలుకరించారు.
జనగామ, ఆలేరు, గూడెప్పాడ్, మల్లంపల్లి సహా పలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేసీఆర్ కాన్వాయిపై పూలు చల్లి తమ అభిమానాన్ని చాటుకొనే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కేసీఆరే స్వయంగా ‘మనం వెళ్లేది పరామర్శకు.. ఇలా పూలు చల్లడం సరికాదు’ అని వారించడం గమనార్హం. నల్లబెల్లి నుంచి తిరుగు ప్రయాణమైన కేసీఆర్ సహా ఆయన వెంట వచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సహా పార్టీ శ్రేణులకు హనుమకొండ జిల్లా మడికొండలో మధ్యాహ్న భోజనం (లంచ్) ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావుపాటు వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ ముచ్చటించారు. అనంతరం కేసీఆర్ ఎర్రవల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జీ జగదీశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సంజయ్ కల్వకుంట్ల, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్ జాదవ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, యాదవరెడ్డి, శంభీపూర్ రాజు, శేరి సుభాష్‌రెడ్డి, క్రాంతికిరణ్ తదితరులు ఉన్నారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో ఉన్న యాదాద్రి-భువనగిరి జిల్లా తురపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో కేసీఆర్ కాసేపు ఆగారు. మాజీ ఎంపీటీసీ పలుకుల నవీన్ కుమార్‌తో పాటు పలువురు గ్రామస్తులను చూసి కేసీఆర్ తన కారును ఆపి కొద్దిసేపు గ్రామస్తులతో ముచ్చటించారు. సీఎంగా ఉన్నప్పటి తన దత్తత గ్రామంలో తనను కలిసిన గ్రామస్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. ‘అధైర్య పడకండి అండగా ఉంటా’ అని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. రాబోయే రెండేండ్లలో వచ్చేది మన ప్రభుత్వమేనని, ఇచ్చిన హామీ ప్రకారం గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. అనంతరం అకడి నుంచి ఎర్రవల్లికి వెళ్లారు.