హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి ( Police Recruitment ) సంబంధించి నిర్వహించనున్న ప్రాథమిక రాత పరీక్షల ( Written Exam ) తేదీలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు ( VV Srinivas Rao ) గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఎస్సై ( SI ) స్థాయి పోస్టుల ప్రాథమిక రాత పరీక్షను నవంబరు 29న, కానిస్టేబుల్ ( Constable ) స్థాయి పోస్టుల పరీక్షను డిసెంబరు 20న నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలిపారు. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక-విపత్తు స్పందన, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి గత జులై 29న నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు వివరించారు.
విభాగాల వారీగా పోలీస్ శాఖలో 200 ఎస్సై, ఏఎస్సై, 4,800 కానిస్టేబుల్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 44 ఎస్సై, 1,380 కానిస్టేబుల్, అగ్నిమాపక శాఖలో 39 ఎస్సై, 751 కానిస్టేబుల్, జైళ్ల శాఖలో 15 ఎస్సై, 208 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వివరించారు. ఆగస్టు 19 నుంచి సెప్టెంబరు 16 వరకు 28 రోజుల పాటు బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 4,29,000 మంది అభ్యర్థుల నుంచి 5,77,064 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
నవంబరు 29న జరిగే ఎస్సై ప్రాథమిక పరీక్షను ఉమ్మడి 10 జిల్లాల కేంద్రాల్లో, డిసెంబరు 20న జరిగే కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షను 15 నుంచి 18 ప్రాంతాల్లో నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు ఛైర్మన్ ప్రకటించారు.