లగచర్ల గిరిజనులపై ఇప్పటికీ అణచివేత కొనసాగుతూనే ఉన్నది. బతుకుదెరువైన భూములను సర్కార్‌కు ధారపోసిన రైతుల కోసం ఏర్పాటు చేసిన ఆర్అండ్ఆర్ కాలనీపై బిగ్ బ్రదర్స్ కన్నుపడింది. 93 ఎకరాల కాలనీలో ప్రైమ్ లొకేషన్ ప్లాట్లను చెరబట్టి వాటిలో షాపింగ్ కాంప్లెక్స్.. పెద్దపెద్ద హోటళ్లు నిర్మించేందుకు పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది.
ఇవేకాకుండా శంషాబాద్ నుంచి కొడంగల్ వరకు ఏర్పాటుచేస్తున్న రేడియల్ రోడ్డు సమీపంలోని ప్లాట్లకూ బిగ్ బ్రదర్స్ ఎసరు పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే పరిహారం అందక నిరసన తెలుపుతున్న నిర్వాసితులపైకి ప్రైవేట్ సైన్యాన్ని ఎగదోసి ఉక్కుపాదం మోపుతున్నా అధికారయంత్రాంగం చేష్టలుడిగి చూస్తున్నది.
మహబూబ్‌నగర్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది రైతుల జీవితాలను ఆగంచేస్తున్నది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పచ్చని పొలాలను బలవంతంగా లాక్కొంటూ భూమినే నమ్ముకొని బతుకీడుస్తున్న గిరిజనుల బతుకుల్లో చీకట్లు నింపుతున్నది. పరిహారం, ఇండ్ల స్థలాలు.. ఉద్యోగాలు.. ఇందిరమ్మ ఇండ్లు అని ఊదరగొట్టి బయటి ప్రపంచానికి ఏదో చేస్తున్నామని భ్రమలు కల్పించి భారీ కుట్రకు తెరలేపింది. పేదల భూములను బడాబాబులకు పంచిపెట్టి పచ్చని పొలాలను, చుట్టూ ఉన్న గుట్టలను ధ్వంసం చేసేసి, నిన్నమొన్నటి వరకు యజమానులుగా ఉన్న గిరిజనులను ఇప్పుడు అదే పార్క్‌లో కూలీలుగా మార్చేసింది. ఇది చాలదన్నట్టు భూనిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌లో ఇచ్చే ప్లాట్లపై బిగ్ బ్రదర్స్ కన్నేశారు. అధికారం అండ చూసుకొని నిర్వాసితుల కోసం 93 ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్న కాలనీలో ప్రైమ్ లొకేషన్ ప్లాట్లను బ్లాక్ చేసినట్టు తెలుస్తున్నది ఈ ప్లాట్లలో షాపింగ్ కాంప్లెక్స్.. వ్యాపారవేత్తల కోసం హోటళ్లు నిర్మించేందుకు నిర్వాసితుల పేరుతో స్థలాలను లాక్కొనేందుకు పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది.
అదీగాక ఇండస్ట్రియల్ పార్క్‌తోపాటు శంషాబాద్ నుంచి కొడంగల్ వరకు ఏర్పాటుచేస్తున్న రేడియల్ రోడ్డు సమీపంలోని ప్లాట్లకూ ఎసరు పెట్టినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే భూసేకరణ పూర్తికాగా ఇంకా చాలామందికి పరిహారం రాక పనులను అడ్డుకొని నిరసనలు తెలిపితే,ఉక్కుపాదంతో అణచివేసి మరీ అనుకున్నది చేసేస్తున్నది. బిగ్ బ్రదర్స్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం లగచర్ల ప్రాంతంలో తిష్టవేసి అరాచక పర్వం సాగిస్తున్నది. ఇంత జరుగుతున్నా బయటి ప్రపంచానికి తెలియకుండా ప్రైవేట్ సైన్యాన్ని సైతం మోహరించారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేట గ్రామ సమీపంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో నిర్వాసితుల కాలనీ వేదికగా సాగుతున్న వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
లే అవుట్లో ప్రైమ్ లొకేషన్లన్నీ బ్లాక్ చేసి..
కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేట, లగచర్ల, రోటిబండ తండా, పులిచర్ల తండా, ఈర్లపల్లి తదితర గ్రామాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1,300 ఎకరాలు సేకరించింది. దాదాపు 80శాతం భూసేకరణ పూర్తికాగా, కొంతభాగం మిగిలి ఉన్నది. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం 2013 జీవో ప్రకారం ఎకరానికి రూ.20 లక్షలు నష్టపరిహారంగా ప్రకటించింది. అంతేకాకుండా భూమి కోల్పోయిన ప్రతి రైతుకు, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ప్లాట్లు కూడా ఇస్తున్నది. ఈ ప్లాట్లలో ఇండ్లు కట్టుకొనేందుకు స్పెషల్ స్టేటస్ కింద ఇందిరమ్మ ఇంటిని కూడా కేటాయించింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. హకీంపేట-లగచర్ల చుట్టుపక్కల సేకరించిన భూములకు సమీపంలోనే భారీ ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్, ఫార్మా పార్కులు సిద్ధం చేస్తున్నది. సేకరించిన రైతులు, ప్రజల నుంచి నిరసనలు రాకుండా మొదట ఎడ్యుకేషన్ హబ్ పేరిట ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటుచేస్తున్నది.
దీనికి చుట్టుపక్కల తమ అనుకూలంగా ఉన్న వ్యాపారవేత్తలకు భూములను పంచి పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నది. ఈ ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో ఏర్పాటుచేస్తున్న నిర్వాసితుల కాలనీలో ప్రైమ్ లొకేషన్లను గుర్తించి దానికి సంబంధించిన స్థలాన్ని రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ చేశారు. తమకు ఫ్యూచర్లో అవసరమైన స్థలాలను ముందే పక్కకు పెట్టి మిగతా ప్లాట్లలో లబ్ధిదారులను గుర్తించి వారికి కొడంగల్‌లో లాటరీ ద్వారా కొంతమందికి కేటాయించారు. ప్రస్తుతం ఈ ఇండస్ట్రియల్ పార్క్ మొత్తం టీజీఐఐసీ ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా నిర్వాసితుల కాలనీకి ఆనుకొని శంషాబాద్ నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు ఏర్పాటుచేస్తున్నారు. ఈ రోడ్డును కూడా కాలనీ పక్క నుంచి పోయేలా చేసి, వాటి చుట్టుపక్కల కూడా ప్రైమ్ ల్యాండ్‌ను తమ ఆధీనంలోకి పెట్టుకున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అక్రమాల వెనుక బిగ్ బ్రదర్స్ హస్తం ఉండటంతో అధికార యంత్రాంగం కూడా మౌనం దాల్చింది.
పేరుకే నిర్వాసితుల కాలనీ.. అసలువి పెద్దలకే!
హకీంపేట గ్రామ సమీపంలో భూములు కోల్పోతున్న రైతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ప్రభుత్వం 93 ఎకరాలను కేటాయించింది. ఇందులో మొత్తం 692 ప్లాట్లు ఏర్పాటుచేసినట్టు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అయితే ఒక ఎకరం భూమి కోల్పోతే ఆ రైతుకు 150 గజాల చొప్పున ఎన్ని ఎకరాలు ప్రభుత్వం సేకరించిందో అన్ని ఎకరాలకు ఒక ప్లాట్ చొప్పున కేటాయిస్తున్నది. ఒక ఎకరం లోపు భూమి పోయిన రైతులకు 75 గజాల ప్లాట్లు ఇస్తున్నది. ఒక రైతు ఐదెకరాల వరకు కోల్పోతే ఆయనకు 150 గజాల ఐదు ప్లాట్లు ఒకే దగ్గర కేటాయించేలా వెంచర్ రెడీ చేశారు. హెచ్ఎండీఏ అప్రూవల్ ప్రకారం వెంచర్లో ప్రధాన రోడ్లతోపాటు ఇంటర్నల్ రోడ్లు కూడా 30 ఫీట్ల వెడల్పుతో ఉండాలి. కానీ ఇక్కడ వేసిన వెంచర్ బ్లూప్రింట్‌లో ఉన్న రోడ్లకు, వాస్తవంగా ఏర్పాటుచేసిన రోడ్లకు భారీ వ్యత్యాసం ఉన్నది. కొన్ని ఇంటర్నల్ రోడ్లు ఇరుకుగా ఏర్పాటుచేయడం, ప్రధాన రోడ్లను తగ్గించడం, పూర్తి మెయిన్ రోడ్డును కూడా తగ్గించి వేయడం చూస్తుంటే ఈ నిర్వాసితుల కాలనీలో పెద్దలకు పెద్దపీట వేసేందుకు కుట్ర పన్నినట్టు అర్థమవుతున్నది.
ప్రధానంగా కోస్గి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రహదారి చుట్టుపక్కల ఇండస్ట్రియల్ పార్క్‌ను ఆనుకొని ఉన్న వెంచర్‌లోని ప్లాట్లు.. రేడియల్ రోడ్డు గుండా వెళ్తున్న ప్లాట్లను కూడా బిగ్ బ్రదర్స్ ఆదేశాలతో బ్లాక్‌లో ఉంచినట్టు తెలుస్తున్నది. 692 ప్లాట్లలో ఇప్పటివరకు భూములు సేకరించిన మొత్తం రైతుల్లో 553 మంది అర్హులని తేల్చారు. ఈ జాబితాలో కూడా భారీ గోల్మాల్ చేసినట్టు ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ నేతలకు, వాళ్ల మద్దతుదారులకు రోడ్డు సైడ్ ఉన్న ప్లాట్లను కేటాయించి.. మిగతా భూములను లబ్ధిదారులకు ఎక్కడంటే అక్కడ కేటాయించినట్టు కూడా చెప్తున్నారు. పేరుకు మాత్రం కొడంగల్‌లో లక్కీ డిప్ నిర్వహించి మొత్తం వ్యవహారాన్ని చిత్రీకరించి పంచినట్టు బిల్డప్ ఇస్తున్నారు. వాస్తవానికి అందుకు విరుద్ధంగా ఇక్కడ కేటాయించారు.
ప్రైమ్ లొకేషన్స్ అన్నీ బంధువులకేనా?
కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ మొదలుకొని పరిహారం, ఆర్అండ్ఆర్ సెంటర్లు నెలకొల్పే వరకు మొత్తం ప్రక్రియ అంతా బిగ్ బ్రదర్స్ కనుసన్నల్లో సాగున్నట్టు తెలుస్తున్నది. నిర్వాసితులకు అందించే ఇండ్ల స్థలాల్లో చేతివాటం చూపడం, ప్రధాన రహదారికి ఆనుకొని అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ చేపడుతున్న సమీప ప్రాంత స్థలాలను తమ గుప్పిట్లోకి తీసుకొని చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తున్నది. అధికారుల అండదండలతో ఈ వ్యవహారాన్ని సాఫీగా నడిపిస్తున్నారు. ప్రశ్నిస్తే వారిపై నిఘా పెడుతున్నారు. లిస్టులు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఏ సమాచారం కావాలని అడిగినా కలెక్టరేట్‌కు లేదా కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్లను కలువండి అంటూ తప్పించుకుంటున్నారు.
అయితే కాంగ్రెస్ ముఖ్య నేత ఆదేశాలను పాటించలేక అధికారులు లోలోపల కుమిలిపోతుండటమే గాక నిర్వాసితులకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇండస్ట్రియల్ పార్కులో ఒక మూలన ఏర్పాటుచేస్తున్న నిర్వాసితుల కాలనీలో బ్లాక్ చేసిన ప్రైమ్ లొకేషన్ ప్లాట్లన్నీ తమ బంధువులకు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. దీనికి బలం చేకూరుస్తూ దాని చుట్టుపక్కల కాంగ్రెస్ మద్దతు దారులకు ప్లాట్లు ఇవ్వడం.. అవసరమైతే వారిని ముందుపెట్టి అడిగిన వాళ్లను బెదిరించే పనిలో పడ్డారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రైమ్ లొకేషన్లలోని ప్లాట్లను కాజేసేందుకు బిగ్ బ్రదర్స్ నిర్వాసితుల కాలనీని కూడా వదలకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
పరిహారం అడిగితే పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పి..
లగచర్ల చుట్టుపక్కల భూములను సర్కార్ ఇంకా బలవంతంగా లాక్కుంటున్నది. ఇటీవల నష్టపరిహారం రాలేదని ఓ కుటుంబం అధికారులను నిలదీస్తే వారిపై పోలీస్ యంత్రాంగం తెల్లవారుజామున విరుచుకుపడింది. కుటుంబ సభ్యులందరినీ బలవంతంగా పోలీస్ జీపుల్లో ఎక్కించి పోలీస్స్టేషన్లు తిప్పి తిప్పి చివరకు అర్ధరాత్రి వదిలిపెట్టారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే, ముఖ్యంగా మీడియాకు లీక్ చేస్తే అంతుచూస్తామంటూ ఓ పోలీస్ అధికారి బెదిరించినట్టు సమాచారం. దీంతో ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నది. వాస్తవంగా ఈ కుటుంబానికి రెండెకరాల భూమిని ఇండస్ట్రియల్ కారిడార్ కోసం లాక్కున్నారు. ఒక ఎకరానికి మాత్రమే పరిహారమిచ్చారు. మిగతా భూమికి ఇవ్వలేదని ఆ కుటుంబం అడిగింది. దీంతో టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు, పోలీస్ యంత్రాంగంతో విరుచుకుపడి ఈ భూమిలో ఉన్న షెడ్లన్నింటినీ కూల్చిపడేసి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. రికార్డుల్లో వారి పేరు లేదని బుకాయిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈర్లపల్లి గ్రామ శివారులో కూడా భారీ పోలీసు బందోబస్తు నడుమ మరికొన్ని భూములను సేకరిస్తున్నారు.
నిఘానీడలో లగచర్ల ప్రాంతాలు
తాము ఓటేస్తే ముఖ్యమంత్రి అయ్యాడని సంతోషపడ్డ ఆ రైతు కుటుంబాల మురిపెం ఆవిరైపోయింది. బక్కచిక్కిన గిరిజన రైతుల ముఖాల్లో ఆనందం అటుంచి ఇప్పుడు ఆక్రోశం కట్టలు తెంచుకుంటున్నది. దశాబ్దాల కాలం నుంచి దర్జాగా రైతులు భూ యజమానులుగా బతికి ఇప్పుడు అదే ఇండస్ట్రియల్ కారిడార్ లో కూలీలుగా పనిచేసే దుస్థితి వస్తుందని ఊహించలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందునా కొడంగల్ నుంచి గెలుపొందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే సంబరాలు చేసుకున్నారు. ఆ సంతోషం కొన్నాళ్లే మిగిలిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పేరు వింటేనే జడిసిపోతున్నారు. గత ఏడాదిన్నరగా లగచర్లలోని గిరిజన తండాలు ఇప్పటికీ నిఘా నీడలో ఉన్నాయి. ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందోనన్న భయం గుప్పిట్లో బతుకుతున్నారు. భూములు కోల్పోయిన సరైన నష్టపరిహారం రాలేక ఎవరికీ చెప్పుకోలేక కుమిలి కుమిలిపోతున్నారు. బిగ్ బ్రదర్స్ అండతో కొందరు కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయి గిరిజనుల బతుకులను చిదిమేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని పోలీసు యంత్రాంగం అంతా ఇప్పుడు లగచర్ల చుట్టుపక్కల కనిపిస్తున్నది.
ఈ ప్రాంతాల్లో తిరుగుతుంటే ప్రతి తండా వద్ద పోలీస్‌ల బృందాలు దర్శనమిస్తున్నాయి. ఇక ఇంటెలిజెన్స్, సివిల్ డ్రెస్సుల్లో ఉన్న పోలీసులకైతే లెక్కేలేదు. చివరకు మహిళా పోలీసులను కూడా రంగంలోకి దింపుతున్నారంటే ఎంత నిర్బంధకాండ కొనసాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఈ ప్రాంతాల్లో హోటళ్లు, గ్రామాల్లో రచ్చబండల వద్ద పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొనే సాహసం కూడా చేయడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇలాకాలో భూ నిర్వాసితులకు అది చేశాం.. ఇది చేశామని చెప్తున్నవన్నీ గొప్పలేనని తేటతెల్లమైంది. నిర్వాసితుల ప్లాట్లలో కూడా బిగ్ బ్రదర్స్ పడగ విప్పిందంటే కొడంగల్ నియోజకవర్గంలో అరాచక పాలనకు అడ్డం పడుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి లబ్ధిదారులకు అండగా నిలువాలని లేకపోతే ఆందోళనకు దిగుతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు.