ఇస్లామాబాద్ : ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యంలో అగ్రరాజ్యం అమెరికా, పాకిస్థాన్ మధ్య కొత్త బంధం ఏర్పడింది. అరుదైన ఖనిజాల(Rare Earth Minerals) ఎగుమతి అంశంలో రెండు దేశాలు తమ అగ్రిమెంట్‌ను అమలు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన స్ట్రాటజిక్ మెటల్స్ శాఖ, పాక్ ప్రభుత్వం మధ్య సెప్టెంబర్‌లో ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అరుదైన ఖనిజాలకు చెందిన తొలి షిప్మెంట్ అమెరికాకు బయలుదేరినట్లు తెలుస్తోంది. అమెరికా కంపెనీ సుమారు 500 మిలియన్ల డాలర్ల పెట్టుబడితో పాకిస్థాన్‌లో మినరల్ ప్రాసెసింగ్, డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఖనిజాల సరఫరా దేశాల్లో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించినున్నట్లు ఈ నేపథ్యంలో అమెరికా ప్రకటన చేసింది.
పాకిస్థాన్ షిప్మెంట్ చేసిన ఖనిజాల్లో యాంటిమోనీ, కాపర్ కాన్సెంట్రేట్, రేర్ ఎర్త్ మెటల్స్ నియోడైమియం, ప్రసియోడైమియం ఉన్నాయి. అమెరికా, పాకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని యూఎస్ఎస్ఎం వెల్లడించింది. పాకిస్థాన్‌లో మినరల్ రిఫైనరీల ఏర్పాటు మార్గం ఈజీ అవుతుందని పేర్కొన్నది. అరుదైన ఖనిజాల ఎగుమతి వల్ల పాకిస్థాన్‌కు బిలియన్లలో ఆదాయం వస్తుందని ఆశిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు ఉంటాయని కొందరంటున్నారు.
ఆ దేశంలో సుమారు ఆరు ట్రిలియన్ల డాలర్ల విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అరుదైన ఖనిజాల విషయంలో అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రతిపక్ష పీటీఐ పార్టీ తప్పుపట్టింది. అమెరికాతో జరుపుకున్న సీక్రెట్ ఒప్పందాలను బహిర్గతం చేయాలని ఆ పార్టీ ప్రతినిధి షేక్ అక్రమ్ డిమాండ్ చేశారు.