శంకర్పల్లి, ఫిబ్రవరి 23 : రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శంకర్పల్లి మున్సిపల్, బీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సోమవారం మండల అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరం నుంచి శంకర్‌పల్లికి తక్కువ సమయంలో చేరుకునే పరిస్థితి ఏర్పడటానికి గతంలో చేపట్టిన అభివృద్ధి పనులేనని తెలిపారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి ప్రస్తుత ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. ఆర్థిక పరిస్థితుల ప్రభావం ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలపై పడుతున్నదని పేర్కొన్నారు. రైతు భరోసా, విద్యుత్ అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. గత ఎన్నికల్లో నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తల మధ్య వచ్చిన విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థుల పేర్లను ముందుగానే నిర్ణయించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మిగతా నాయకులు పూర్తి మద్దతివ్వాలని కోరారు. పార్టీకీ సంబంధించిన సమస్యలు లేదా ఫిర్యాదులుంటే తనకు తెలియజేయాలని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేవరకు అందరూ కష్టపడి పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచులు, కౌన్సిలర్లకు సన్మానం చేశారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్, మండల సీనియర్ నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ జడ్పీపీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు వాసుదేవ్‌కన్నా, శ్రీకాంత్‌రెడ్డి, బోరంపేట రామ్మోహన్‌రెడ్డి, సయ్యద్ అఫ్సర్, మద్దూరి కృష్ణ, శంకర్‌నాయక్ తదితరులు తమ అనుచరులతో 200 మంది వారి పార్టీలను వీడి సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆమె వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన నాయకులు.. తమపై నమ్మకముంచి పార్టీలో చేర్చుకున్నందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపి, పార్టీ పటిష్టత కోసం పాటుపడతామని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడిగా బద్దం శశిధర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆయనకు నియామకపత్రాన్ని సభాముఖంగా సబితారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేస్తానని పేర్కొన్నారు.