పట్నా: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్‌లో అందరి దృష్టి ముగ్గురు ముఖ్య నాయకులపైనే ఉంది. సీఎం నితీశ్‌కుమార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్, జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ల రాజకీయ భవిష్యత్తు ఈ ఎన్నికలపై ఆధారపడి ఉంది. వీరి జయాపజయాలు జేడీయూ, ఆర్జేడీ, జన్-సురాజ్ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నాయి.
సీఎం నితీశ్‌కుమార్: 74 ఏండ్ల నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు సుశాసన్‌బాబుగా పేరొందిన ఆయన.. ఇటీవల మాత్రం వరుసగా కూటములు మారుతూ అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలు ఆయన ఆరోగ్యంపై అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఒకవేళ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినా, సీఎం పదవిని ఆయన చేపట్టగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారా? లేక రాష్ట్రంలో ఇక నితీశ్ శకం ముగుస్తుందా అన్నది ఈ ఎన్నికలతో తేలిపోనుంది.
తేజస్వీయాదవ్: ఆర్జేడీని ఒంటి చేత్తో నడిపిస్తున్న యువనేత తేజస్వీయాదవ్‌కు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 75 స్థానాల్లో విజయం సాధించి అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
ప్రశాంత్ కిషోర్: ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ ఏడాది క్రితం ‘జన్-సురాజ్’ పార్టీని స్థాపించి రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో లభిస్తున్న ఆదరణ.. ఎన్నికల ఫలితాల్లోనూ కనపడుతుందని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు.