న్యూఢిల్లీ: తన పిల్లలను దేశం నుంచి పంపించవద్దని కోరిన ఇజ్రాయెలీ వ్యక్తికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రష్యన్ మహిళ నీనా కుటిన, తన ఇద్దరు పిల్లలతో కలిసి కర్ణాటకలోని గోకర్ణ, రామతీర్థ కొండ గుహలో జూలై 11న కనిపించిన సంగతి తెలిసిందే. వీరు ఈ గుహలో రెండు నెలలపాటు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరి వద్ద చెల్లుబాటయ్యే పత్రాలేవీ లేవు. రష్యన్ కాన్సులేట్ ఈ ముగ్గురికి ఎమర్జెన్సీ ట్రావెల్ పేపర్స్‌ను జారీ చేసింది. ఆ సమయంలో ఇజ్రాయెల్ జాతీయుడు డ్రోర్ ష్లోమో గోల్డ్‌స్టీన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఇద్దరు పిల్లలకు తండ్రిని తానేనని చెప్పారు. పిల్లలిద్దరినీ వెంటనే దేశం నుంచి పంపించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. తన పిల్లలు కనిపించడం లేదంటూ నిరుడు ఆయన గోవాలోని పనాజీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కర్ణాటక హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. నీనా కుటినను, ఆమె పిల్లలిద్దరినీ రష్యాకు పంపించేందుకు ఏర్పాట్లు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.
సాధ్యమైనంత త్వరగా రష్యాకు వెళ్లిపోవాలనుకుంటున్నానని ఆమె రష్యన్ కాన్సులేట్‌కు చెప్పిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. కుటిన, ఇద్దరు పిల్లలు గుహలో ఎందుకు ఉన్నారో తెలిపే వివరణను గోల్డ్‌స్టీన్ ఇవ్వలేకపోయారని పేర్కొంది. దీంతో గోల్డ్‌స్టీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపి, పిల్లలు గుహలో నివసిస్తున్నపుడు ఏం చేశారని గోల్డ్స్టీన్ను ప్రశ్నించింది. “మీకు ఉన్న హక్కు ఏమిటి? మీరు ఎవరు?” అని ప్రశ్నించింది. గోల్డ్‌స్టీన్ తరపు న్యాయవాది స్పందిస్తూ, ఆయన ఆ పిల్లలకు తండ్రి అని చెప్పారు. జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, “మీరు తండ్రి అని అధికారికంగా ప్రకటించిన పత్రాలేమైనా చూపించండి. మిమ్మల్ని దేశం నుంచి పంపించేయాలని మేం ఎందుకు ఆదేశించకూడదు?” అన్నారు. జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి మాట్లాడుతూ, ఇది పబ్లిసిటీ లిటిగేషన్ అన్నారు. జస్టిస్ కాంత్ మాట్లాడుతూ, “మీ పిల్లలు గుహలో నివసిస్తూ ఉంటే, మీరు ఏం చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. గోవాలో మీరు ఏం చేస్తున్నారు? అని అడిగారు. “ఈ దేశం ఓ ఆశ్రమంగా మారిపోయింది, ఎవరైనా వస్తారు, ఉండిపోతారు” అన్నారు. ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి గోల్డ్స్టీన్కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.