వికారాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులను నట్టేట ముంచింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని రూ.16 వేలు సాయం అందిస్తామని అబద్ధపు హామీనిచ్చి రూ.12 వేలకు తగ్గిస్తూ ఏడాదికి నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కారు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేకపోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసేందుకు రైతు బంధు సాయాన్ని అందజేయగా.. ప్రస్తుత సర్కారు సకాలంలో సాయం ఇవ్వకపోవడం, మరోవైపు అప్పులు దొరకక అన్నదాతలు తీవ్ర కష్టాలు పడుతున్న పరిస్థితులున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రైతు భరోసా సాయాన్ని కేవలం ఈ వానకాలం సీజన్లో మాత్రమే పూర్తిగా అందజేయగా, రెండేళ్లుగా అన్నదాతలకు మోసపూరిత మాటలను చెప్తూ వస్తుండటం గమనార్హం.
యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా సాయం అందజేసే దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. సాగుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా సాయాన్ని అందజేస్తామని ఏడాదిపాటు కాలయాపన చేసిన సర్కారు.. మూడు నెలలవుతున్నా ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు. చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది పేద రైతులు తమకున్న ఎకరా, రెండెకరాల పొలంలో పంటలు సాగు చేయకుండా బీడుగానే ఉంచుతున్న దయనీయ పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో గుంట భూమి మొదలుకొని ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతు బంధు సాయాన్ని అందజేసేవారు. జిల్లావ్యాప్తంగా 12.35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూములున్నాయి. వీటిలో అర్హులైన వారిని గుర్తించి ప్రతి సీజన్‌కు 6 లక్షల ఎకరాలకుపైగా వ్యవసాయ భూములకు రూ.300 కోట్లపైగా రైతు బంధు సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
అన్నదాతలకు అదునుకు అనుగుణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అందించేది. కాని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు వరి నాట్లు వేసి నెల రోజులవుతున్నా ఇప్పటివరకు రైతు భరోసా వేయలేదు. దీన్నిబట్టి ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న శ్రద్ధ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సాయం వస్తుందని అప్పులు తీసుకువచ్చి సాగుచేశాం. రైతు భరోసా డబ్బులను సర్కారు వెంటనే విడుదల చేయాలి.
తాము వరి పంట వేసి నెల రోజులవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న రైతు భరోసా డబ్బులు ఇప్పటికీ వేయలేకపోయింది. దీనిపై సర్కారు ఇంకా నాన్చుతున్నది. అన్నదాతలను ఆదుకోని ప్రభుత్వాలకు మనుగడ ఉండదు. రైతుల పట్ల ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. గతంలో సాగుకు ముందుగానే రైతు బంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో పడేవి.