Sarnath | బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన తొలి ఉపన్యాసం ఇచ్చిన పురాతన ప్రదేశమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రాచీన బౌద్ధ క్షేత్రమైన సారనాథ్‌కు(Sarnath) యునెస్కో(UNESCO) ప్రపంచ వారసత్వ జాబితాలో అధికారికంగా స్థానం లభించింది. సారనాథ్ ఒక పవిత్ర భూమి. ఇక్కడే బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన తర్వాత మానవాళికి తన మొదటి ప్రబోధాన్ని ఇచ్చి ‘ధర్మచక్ర ప్రవర్తన’కు నాంది పలికారు. దక్షిణ కొరియా లోని బుసాన్‌లో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కాగా, బౌద్ధమతంలోని అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటైన సారనాథ్, వారసత్వ గుర్తింపు కోసం ప్రపంచ వేదికపై తన ప్రాముఖ్యతను నమోదు చేసుకుంది. యూపీ పర్యాటక శాఖ ప్రకారం, సారనాథ్‌ను జూలై 3, 1998న యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చారు. 28 సంవత్సరాల తర్వాత, దీనిని అధికారికంగా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఇప్పటి వరకు యూపీలోని మూడు ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఆగ్రా ప్రాంతంలోని తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ గుర్తింపు పొందాయి.
తాజాగా సార్నాథ్ కూడా చేరడంతో అంతర్జాతీయ పర్యాటక, సాంస్కృతిక వారసత్వ పటంలో ఉత్తర ప్రదేశ్ బౌద్ధ సర్క్యూట్‌ను బలోపేతం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ఈ నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. జ్ఞానం, కరుణ, సామరస్యం అనే కాలాతీత సందేశం ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే బుద్ధ భగవానుడితో సారనాథ్‌కు సన్నిహిత సంబంధం ఉంది అని ప్రధాని తెలిపారు. ఇది ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.