DK Shivakumar | మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూకుంభకోణం ఆరోపణలు కర్ణాటకలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అడ్డంగా బుక్కయ్యారు. ముడా నుంచి తన భార్యకు అనుచితంగా లబ్ధి కలిగించినట్లు సీఎంపై ఆరోపణలున్నాయి. దీంతో కుంభకోణం వ్యవహారంలో ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడంతో కర్ణాటక కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ క్రమంలో సీఎం పదవికి సిద్ధు రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వెల్లువెతుతున్నాయి.
బీజేపీ సైతం సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెంచుతోంది. ఈ అంశంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి స్పందించారు. సిద్ధరామయ్య అమాయకుడని.. ఈ అంశంలో బీజేపీ రాజకీయ డ్రామాకు తెరలేపిందని వ్యాఖ్యానించారు. ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శివకుమార్ మాట్లాడుతూ.. ‘సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసే ప్రశ్నే లేదు. దేశంలోని చట్టం మా ముఖ్యమంత్రిని కాపాడుతుంది. సిద్ధరామయ్య అమాకుడు. ఈ అంశంలో బీజేపీ రాజకీయ డ్రామా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మొత్తం ముఖ్యమంత్రికి సపోర్ట్‌గా ఉంది. సీఎం తప్పు చేశాడని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలూ లేవు’ అని శివకుమార్ తెలిపారు.
మరోవైపు తనపై ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధరామయ్య ఇటీవలే హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును ఈ నెల 29న విచారణకు జాబితా చేసింది. కేసు విచారణ వరకు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది. ఈ సందర్భంగా సమాధానం చెప్పాలని ప్రతివాదులను కోర్టు కోరింది.
ఏమిటీ స్కాం?
బీజేపీ నేతలు, హక్కుల కార్యకర్తల ఆరోపణల ప్రకారం.. మైసూరు శివారులోని కెసరె గ్రామంలో సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. అయితే, అవసరాల దృష్ట్యా ఆ భూమిని సేకరించిన ప్రభుత్వం.. దానికి బదులుగా నగరం లోపల అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా చెప్పుకొనే విజయనగర్, దట్టగల్లీ, జేపీ నగర్, ఆర్టీ నగర్, హంచయా-సతాగల్లీలో సిద్ధరామయ్య కుటుంబానికి 38,283 చదరపు అడుగుల భూమిని కేటాయించింది. 50:50 నిష్పత్తిలో (పడావు పడ్డ ఒక ఎకరా తీసుకొంటే, అభివృద్ధి చేసిన అర్ధ ఎకరం ఇవ్వడం) ఈ కేటాయింపు జరిగింది. అయితే, కెసరెలోని భూములతో పోలిస్తే మార్కెట్ ధర అతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సిద్ధరామయ్య కుటుంబానికి ఆ భూములను కేటాయించాలని ఎవరు సిఫారసు చేశారని బీజేపీ నేత ఆర్ అశోక్ నిలదీశారు.
క్యాబినెట్ అనుమతి లేకుండా భూములు కేటాయించే అధికారం ఎవరికి ఉంటుందని, ముఖ్యమంత్రికి తెలియకుండానే రూ. 4 వేల కోట్ల విలువజేసే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందా? అని ఆయన ప్రశ్నించారు. ముడా భూకుంభకోణంలో సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర పాత్ర ఉన్నదని, ఆయనే దీనికి అసలు సూత్రధారని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ ఆరోపించారు. ఈ స్కామ్ మూలంగా వేల కోట్లు పక్కదారి పట్టాయని ముగ్గురు హక్కుల కార్యకర్తలు ప్రదీప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ.. లోకాయుక్త పోలీసులు సహా గవర్నర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్ సీఎంపై విచారణకు అనుమతినిచ్చారు.
Also Read..
Safety Of Doctors | ఆసుపత్రుల్లో వైద్యుల భద్రతకు కీలక సూచనలు చేసిన సుప్రీంకోర్టు
Teesta Dam Power Station: కొండచరియలు విరిగిపడి.. తీస్తా డ్యామ్ పవర్ స్టేషన్ ధ్వంసం.. వీడియో