Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb threat) సర్వసాధారణమైపోయాయి. పాఠశాలలు, విమానాశ్రయాలు, కార్యాలయాలు, నేతలకు ఇటీవలే వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. గత వారం హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ (Gurugram) నగరంలోని ఆంబియెన్స్ మాల్ (Ambience mall) సహా నోయిడా ప్రాంతాల్లోని పలు షాపింగ్ మాల్స్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా దక్షిణ ఢిల్లీలోని మూడు మాల్స్‌కు (3 South Delhi malls), ఓ ఆసుపత్రికి సోమవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. చాణక్యపురిలోని చాణక్య మాల్, సాకేత్ ప్రాంతంలోని సెలెక్ట్ సిటీవాక్, వసంత్ కుంజ్‌లోని ఆంబియెన్స్ మాల్ సహా చాణక్యపురిలోని ప్రైమస్ ఆసుపత్రికి ఈ మెయిల్ ద్వారా బాబు బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు. కొన్ని గంటల్లో బాంబు పేలుతుందంటూ దుండగులు మెయిల్లో పేర్కొన్నట్లు చెప్పారు.
సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఆయా మాల్స్, ఆసుపత్రి వద్దకు చేరుకొని సోదాలు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే, ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, ఈ నెల 17న గురుగ్రామ్‌లోని ఆంబియెన్స్ మాల్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు మాల్ మేనేజ్మెంట్కు మెయిల్ ద్వారా బెదిరించారు. ‘ప్రతి ఒక్కరినీ చంపేందుకు మాల్లో బాంబులు అమర్చాం. మీలో ఎవ్వరూ తప్పించుకోలేరు (None of you will escape). అందరూ చస్తారు’ అంటూ అందులో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన మాల్ అధికారులు వెంటనే పోలీసులు ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని మాల్‌ను ఖాళీ చేయించారు.
బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అప్పుడు కూడా ఎలాంటి బాంబూ దొరకలేదని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. ఇక అదేరోజు నోయిడాలోని డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా వద్ద కూడా బాంబు వార్త కలకలం రేపింది. దీంతో అధికారులు మాల్‌ను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. అయితే, మాల్ భద్రతను తనిఖీ చేయడానికి మాక్ డ్రిల్ కోసం ఇలా చేసినట్లు తర్వాత అధికారులు స్పష్టతనిచ్చారు.
Also Read..
Safety Of Doctors | ఆసుపత్రుల్లో వైద్యుల భద్రతకు కీలక సూచనలు చేసిన సుప్రీంకోర్టు
Supreme Court | వైద్యులు వీలైనంత త్వరగా విధుల్లోకి చేరండి.. సుప్రీంకోర్టు విజ్ఞప్తి
Joe Biden | భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు.. పార్టీ సదస్సులో ట్రంప్‌పై విమర్శలు