కారేపల్లి : మారుతున్న సామాజిక, అనారోగ్య కారణాల వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ( Health ) పై దృష్టి సారించాలని విశ్రాంత సీహెచ్‌వో రాజకుమారి అన్నారు. కారేపల్లి ( Karepally ) ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం పేరుపల్లి గ్రామంలో వారం రోజుల పాటు ఏర్పాటుచేసిన శిబిరాన్ని ఆమె సందర్శించారు.
ఆమె మాట్లాడుతూ పూర్వ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు అనేక విధానాలను పాటించే వారన్నారు. ప్రతి ఆచారం వెనుక ఆరోగ్యదాయక క్రియ దాగి ఉండేదని , తాత, ముత్తాతల నుంచి వస్తున్న సంప్రదాయ పద్ధతులు క్రమ క్రమంగా కనుమరుగవు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మారుతున్న ఆహారపు అలవాట్లు ,శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి వెరసి చిన్న వయసులోనే రోగాల బారిన పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించారు. మూడు పదుల వయసులోనే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు చుట్టముట్టడంతో గుండె, కిడ్నీ, లివర్, కంటి సంబంధిత వ్యాధులు వస్తున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి పౌషకాహారంపై సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది రక్త హీనతబారిన పడుతున్నారన్నారు.
16-25 ఏళ్లలోపు యువతులు ఎక్కువగా జంక్‌ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌ను మితిమీరి ఇష్టంగా తింటూ ఆకు కూరలు, పండ్లను విస్మరిస్తున్నారని ఆరోపించారు. డైటింగ్ చేయక పోవడం, త్వరగా గర్భం దాల్చడం, ప్రసవం అయిన తర్వాత బిడ్డకు నడుమ గ్యాప్ లేకపోవడంతో యువతులు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎన్. విజయ కుమారి, ప్రోగ్రాం ఆఫీసర్ సుధారాణి, మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.