భోపాల్: స్కూల్ వ్యాన్ రాకపోవడంతో ఒక బాలిక వినూత్నంగా నిరసన తెలిపింది. స్కూల్ బ్యాగ్‌తో రోడ్డు మధ్యలో కూర్చున్నది. ఆ విద్యార్థిని పలు గంటల పాటు రోడ్డును దిగ్బంధించింది. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. (School girl Blocks Road) మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పదేళ్ల సురభి యాదవ్ ఐదో తరగతి చదువుతున్నది. విద్యా హక్కు చట్టం కింద ఆ బాలికను అధికారులు ప్రైవేట్ స్కూల్లో చేర్చారు. దీంతో గ్రామం నుంచి 18 కిలోమీటర్ల దూరంలోని ఆ స్కూల్‌కు వ్యాన్‌లో వెళ్లి వస్తున్నది.
కాగా, కొన్ని రోజులుగా వ్యాన్ రాకపోవడంతో ఆ బాలిక స్కూల్‌కు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం విద్యార్థిని సురభి యాదవ్ వినూత్నంగా నిరసన తెలిపింది. స్కూల్ డ్రెస్ ధరించిన ఆ బాలిక స్కూల్ బ్యాగ్ పట్టుకుని రోడ్డు మధ్యలో కూర్చొన్నది. ‘స్కూల్‌కు వెళ్లాలనుకుంటున్నా’ అని చెబుతూనే ఉన్నది. ఆ బాలిక అక్కడి నుంచి కదలకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, విద్యా శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. స్కూల్ యాజమాన్యంతో మాట్లాడతామని విద్యార్థినికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మూడు గంటల పాటు రోడ్డు మధ్యలో కూర్చొన్న ఆ బాలిక లేచి వెళ్లింది. ఆ తర్వాత వాహనాలు అక్కడి నుంచి కదిలాయి.
కాగా, విద్యా హక్కు చట్టం కింద ఆ బాలికకు ఉచితంగా చదువు అందిస్తున్నట్లు ప్రైవేట్ స్కూల్ తెలిపింది. అయితే బాలిక కుటుంబం గత రెండేళ్లుగా రవాణా ఫీజు చెల్లించడం లేదని చెప్పింది. వ్యాన్ సర్వీస్ ఉచితం కాదని చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదని, బాలికను పంపడం మానేశారని స్కూల్ మేనేజ్మెంట్ ఆరోపించింది. అలాగే వ్యాన్ డ్రైవర్ పట్ల వారు దురుసుగా ప్రవర్తించినట్లు పేర్కొంది.
Also Read:
Migrant Worker Lynched | బంగ్లా దేశీయుడిగా అనుమానించి.. వలస కార్మికుడిని కొట్టి చంపారు