Supreme Court | కోల్‌కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ గత 10 రోజులుగా వైద్యులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. వైద్యుల నిరసనతో ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు సమ్మెను విరమించి తమ విధుల్లోకి చేరాలని దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) కోరింది.
ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసును సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆ బెంచ్‌లో జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలు ఉన్నారు. విచారణ సందర్భంగా జూనియర్, సీనియర్ డాక్టర్ల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, డాక్టర్ల సమ్మెతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొంది. ఈ మేరకు వైద్యులు వెంటనే సమ్మె విరమించి తమ విధుల్లోకి చేరాలని (Resume Duties) కోరింది. ‘వైద్యులందరి భద్రత, సంక్షేమానికి సంబంధించిన విషయాలను కోర్టు పరిశీలిస్తున్నందున.. ప్రస్తుతం విధులకు దూరంగా ఉన్న వైద్యులు వీలైనంత త్వరగా తిరిగి విధుల్లోకి చేరాలని మేము కోరుతున్నాము’ అని సుప్రీం ధర్మాసనం తెలిపింది.
వైద్యుల భద్రతకై జాతీయ టాస్క్ ఫోర్స్..
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ ఓ జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. డాక్టర్ల భద్రత గురించి టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే.. వారికి సామాజిక భద్రత కల్పించడమే ఆ టాస్క్ ఫోర్స్ ఉద్దేశంగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా డాక్టర్ల భద్రత గురించి ఏకాభిప్రాయాన్ని క్రియేట్ చేయాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ బృందంలోని సభ్యుల పేర్లను కూడా సుప్రీం వెల్లడించింది.
జాతీయ టాస్క్ ఫోర్స్ బృందం జాబితా: సర్జర్ వైస్ అడ్మిరల్ ఆర్ సరిన్, డాక్టర్ డీ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఎం శ్రీనివాస్ , డాక్టర్ ప్రతిమా మూర్తి, డాక్టర్ గోవర్దన్ దత్ పురి, డాక్టర్ సౌమిత్ర రావత్, ప్రొఫెసర్ అనితా సక్సేనా(ఎయిమ్స్ కార్డియాలజిస్ట్), ప్రొఫెసర్ పల్లవి సప్రే (ముంబై గ్రాంట్ కాలేజీ డీన్), డాక్టర్ పద్మ శ్రీవాత్సవ్ (ఎయిమ్స్ న్యూరాలజీ) ఉన్నారు. వీరితో పాటు భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వం హోం కార్యదర్శి, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, జాతీయ మెడికల్ కమీషన్ చైర్పర్సన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ ప్రెసిడెంట్ ఆ జాబితాలో ఉన్నారు.
Also Read..
Supreme Court: బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్.. ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు