న్యూఢిల్లీ: శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్నవారిపై అధికారాన్ని వాడరాదు అని బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు(Supreme Court) హెచ్చరిక జారీ చేసింది. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో.. ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం.. బెంగాల్ సర్కార్‌పై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేసింది. నిరసనకారులపై దాడి చేయడం సరికాదు అని కోర్టు పేర్కొన్నది. మేం జోక్యం చేసుకోబోయే అంశాల గురించి వెల్లడిస్తున్నామని, శాంతియుతంగా నిరసన చేపడుతున్నవారిపై బెంగాల్ సర్కార్ పవర్‌ను వాడరాదు అని, డాక్టర్లు అయినా లేక సాధారణ పౌరులైనా, వారిపై అధికారాన్ని వాడరాదు అని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు.
ట్రైనీ డాక్టర్ శరీరాన్ని ఆమె పేరెంట్స్‌కు అప్పగించడంలో ఎందుకు జాప్యం చేశారని బెంగాల్ సర్కార్‌ను కోర్టు ప్రశ్నించింది. ఈ కేసును విచారించడంలోనూ బెంగాల్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కోర్టు చెప్పింది. ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసును బెంగాల్ ప్రభుత్వం సరైన రీతిలో నియంత్రించలేకపోయిందని, ఆస్పత్రిలో జరిగిన విధ్వంసాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సీజీఐ చంద్రచూడ్ వెల్లడించారు. చంద్రచూడ్‌తో పాటు జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.