న్యూఢిల్లీ: కోల్‌కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ ఓ జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. డాక్టర్ల భద్రత గురించి టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే.. వారికి సామాజిక భద్రత కల్పించడమే ఆ టాస్క్ ఫోర్స్ ఉద్దేశంగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా డాక్టర్ల భద్రత గురించి ఏకాభిప్రాయాన్ని క్రియేట్ చేయాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కేసులో ఇవాళ సుప్రీం త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, ఆ బృందంలోని సభ్యుల పేర్లను కూడా సుప్రీం వెల్లడించింది.
జాతీయ టాస్క్ ఫోర్స్ బృందం జాబితా: సర్జర్ వైస్ అడ్మిరల్ ఆర్ సరిన్, డాక్టర్ డీ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఎం శ్రీనివాస్ , డాక్టర్ ప్రతిమా మూర్తి, డాక్టర్ గోవర్దన్ దత్ పురి, డాక్టర్ సౌమిత్ర రావత్, ప్రొఫెసర్ అనితా సక్సేనా(ఎయిమ్స్ కార్డియాలజిస్ట్), ప్రొఫెసర్ పల్లవి సప్రే(ముంబై గ్రాంట్ కాలేజీ డీన్), డాక్టర్ పద్మ శ్రీవాత్సవ్(ఎయిమ్స్ న్యూరాలజీ) ఉన్నారు. వీరితో పాటు భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వం హోం కార్యదర్శి, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, జాతీయ మెడికల్ కమీషన్ చైర్పర్సన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ ప్రెసిడెంట్ ఆ జాబితాలో ఉన్నారు.
జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యులు ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. లింగ ఆధారిత నేరాలను అరికట్టేందుకు ప్రణాళికలు వేయాలి. ఇంటెర్నీలు, రెసిడెంట్, నాన్ రెసిడెంట్ డాక్టర్ల భద్రత కోసం జాతీయ ప్రణాళికలను టాస్క్ ఫోర్స్ సభ్యులు రూపొందించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ రూంల వద్ద అదనపు భద్రతను పెంచడం, ఆస్పత్రుల వద్ద బ్యాగేజీ స్క్రీనింగ్ పెంచడం, పేషెంట్లు కాని వారు ఓ పరిధి దాటి లోపలికి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. ఆస్పత్రుల్లో జనాన్ని అదుపు చేసేందుకు భద్రత కావాలి, డాక్టర్లకు రెస్టు రూమ్‌లు కావాలి. అన్ని ప్రాంతాల్లో సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలి, సీసీటీవీలను ఏర్పాటు చేయాలి. మెడికల్ ప్రొఫెషనల్స్‌ను తరలిచేందుకు రాత్రి పది నుంచి ఆరు వరకు ట్రాన్స్‌పోర్టు చేయాలి. ఎమర్జెన్సీ వేళ మెడికల్ ప్రొఫెషనల్స్ కోసం హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలి అని మార్గదర్శకాల్లో సూచించారు.
మెడికల్ ప్రొఫెషనల్స్‌కు సంస్థాగత భద్రత అవసరమని విచారణ సందర్భంగా సీజేఐ తెలిపారు. 36 గంటల పాటు విధుల్లో ఉండే డాక్టర్లు, ఇంటెర్నీలు, రెసిడెంట్, నాన్ రెసిడెంట్ డాక్టర్లకు రెస్టు రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. దేశ ప్రయోజనాలు, సమానత్వ కోసం మహిళా డాక్టర్లకు భద్రత కల్పించాలని సీజేఐ స్పష్టం చేశారు. మరో రేప్ జరిగే వరకు చర్యలు తీసుకోకుండా ఉండలేమని, వైద్యులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు ఉన్నా, అవి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకోవడం లేదని సీజే వెల్లడించారు.