సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : వంటగ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని నగర సీపీ సజ్జనార్ అన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారని చెప్పారు. తక్షణమే సిలిండర్ ఇస్తామని బురిడీ కొట్టించే ప్రకటనలు నమ్మొద్దని సూచించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే ఫేక్ వెబ్సైట్లు, లింక్‌లను క్లిక్ చేయొద్దని పేర్కొన్నారు. సిలిండర్ బుకింగ్‌ల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఆశ్రయించాలని వివరించారు. ఒకవేళ మోసాలకు గురయితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930కి కాల్ చేయాలని, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.