ఖలీల్వాడి/కామారెడ్డి, మార్చి 11:వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. 38 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరగడంతో మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ కరెంట్ వాడకం భారీగా పెరుగుతున్నది. రోజుకు సగటున 19.38 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వేసవి ఆరంభంలోనే ఇలా ఉంటే, ఏప్రిల్, మే మాసాల్లో ఎండల తీవ్రత, కరెంట్ వినియోగం ఏ స్థాయికి చేరుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. నిజామాబాద్ జిల్లాలో గృహ కనెక్షన్లు 5.52 లక్షలు, 1.90 లక్షల వ్యవసాయ, 94 వేల వాణిజ్య కనెక్షన్లు కలుపుకుని మొత్తం 8.41 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడే విద్యుత్ వినియోగం ఇంతలా పెరుగుతున్న తరుణంలో వచ్చే రోజుల్లో కోతలు మొదలయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
నిజామాబాద్లో 12 ఎం.యూ. వాడకం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొద్దిరోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. సగటున 37-38 డిగ్రీల దాకా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు, వరి పొలాలు ప్రస్తుతం పొట్ట దశలో ఉండడంతో నీరు అధికంగా పెట్టాల్సి వస్తున్నది. అటు కూలర్లు, ఏసీలు ఆన్ కావడం, ఇటు వ్యవసాయ పంపుసెట్ల వాడకం పెరగడంతో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగి పోయింది. నిజామాబాద్ జిల్లాలో రోజూ సరాసరి 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. గత నెల 25న 1,018 మిలియన్ యూనిట్ల మేర వినియోగిస్తే, అదే గత వారం (మార్చి 4వ తేదీన) 1,258 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం పెరిగింది. అంటే వారం వ్యవధిలోనే 2.40 మిలియన్ యూనిట్ల మేర వినియోగం పెరగడం గమనార్హం. జనవరిలో వినియోగించిన కరెంట్ కంటే ఫిబ్రవరిలో 8.91 మి.యూనిట్ల మేర పెరిగింది.

కామారెడ్డిలో..
కామారెడ్డి జిల్లాలోనూ విద్యుత్ వినియోగం పెరిగి పోయింది. ప్రతి రోజూ 7.38 మిలియన్ యూనిట్లు ఖర్చవుతున్నది. ఇందులో వ్యవసాయానికి అత్యధికంగా 3.9 మిలియన్ యూనిట్లు కాగా, గృహ, కమర్షియల్ అవసరాలకు 2.3 మిలియన్ యూనిట్లు వినియోగిస్తున్నారు. జిల్లాలో 3.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా 2.61 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతున్నది. ప్రస్తుతం పొట్ట దశలో ఉండడంతో నీరు అధికంగా పెట్టాల్సిన తరుణంలో పంపుసెట్లు నిరంతరం నడుస్తున్నాయి. దీంతో విద్యుత్ వాడకం పెరిగింది. కామారెడ్డి జిల్లాలో 1.70 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. 132 సబ్స్టేషన్ల పరిధిల్లో 29,470 ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పడుతుండడంతో అవి కాలిపోతున్నాయి. వ్యవసాయానికి మార్చి నెల చివరి నెల కావడంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉన్నదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి, వాటి పనితీరును పరిశీలిస్తున్నారు.
రికార్డు స్థాయిలో పంటల సాగు…
ఉమ్మడి జిల్లాలో యాసంగి పంటల సాగు భారీగా పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో వరి పంట 4.90 లక్షల ఎకరాల్లో సాగైనట్లు అధికారులు చెబుతున్నారు. మక్క కూడా 32 వేల ఎకరాల్లో, ఇతర పంటలు కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే, జిల్లాలో బోర్లపై ఎక్కువగా ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది
విద్యుత్ వినియోగం పెరిగింది
గతేడాది అధిక వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. ఈ నెలలోనే అత్యధికంగా కరెంట్ వాడకం పెరిగే అవకాశం ఉన్నది. ఏప్రిల్ నుంచి వ్యవసాయ విద్యుత్ వినియోగం కొంత తగ్గే అవకాశం ఉన్నది.
-రవీందర్, విద్యుత్ శాఖ ఎస్ఈ, కామారెడ్డి జిల్లా
