కామారెడ్డి, మార్చి 11: రైతుల సమస్యలు తీర్చాలని బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు ఆందోళనకు దిగారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం నేత చెలిమెల భానుప్రసాద్ మాట్లాడుతూ.. రైతులను మోసం చేసిన రేవంత్ సర్కార్‌కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరిచారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని కోరారు.
రైతుల మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెబుతారన్నారు. రైతుల సమస్యల పట్ల, రైతుల పక్షాన పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. రైతులకు అండగా పోరాటం చేస్తామని చెప్పారు. వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు రంజిత్ వర్మ, శేఖర్, లష్కర్ నాయక్, ప్రభాకర్‌రెడ్డి, దేవరాజు, సతీశ్, రామ్మూర్తిగౌడ్, చంద్రకాంత్, సంగమేశ్వర్, పరశురామ్‌గౌడ్, బాబాగౌడ్, సమీర్, సాయి, గఫార్, భానుకిరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.