KCR | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపంగా మారిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ముఖ్యంగా సమైక్య పాలనలో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సమైక్య అంధ్రప్రదేశ్‌లో అత్యంత వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్‌నగర్ జిల్లా అని తెలిపారు.
‘ కృష్ణా జిల్లా ప్రవేశించేదే మహబూబ్‌నగర్ జిల్లా. 300 కి.మీ. కంటే ఎక్కువ పారేది కూడా మహబూబ్‌నగర్ జిల్లాలోనే. అయినా కూడా అప్పటికి 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ.. సుమారు 20 ఏండ్లు పాలించిన టీడీపీ కానీ.. పాలమూరు తిరిగి కోలుకోలేని దెబ్బ కొట్టాయి.’ అని కేసీఆర్ తెలిపారు. ‘ అప్పర్ కృష్ణా, బీమా, తుంగభద్ర ఎడమ కాల్వ ప్రాజెక్టుల ద్వారా ఆనాటికి 174 టీఎంసీలు పాలమూరు – రంగారెడ్డికి రావాల్సి ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపంగా పరిణమించింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. ప్రతిపాదించబడిన ప్రాజెక్టులను మార్చకూడదు.. వాటిని కొనసాగించాలని ఎస్ఆర్సీ యాక్ట్ చెబుతుంది.. కానీ వాటిని కాదని మొత్తం క్యాన్సిల్ చేశారు. గోదావరి మీద దేవనూరు ప్రాజెక్టు, ఇచ్చంపల్లి రకరకాల ప్రాజెక్టులను అబాండ్ చేశారు. అందులో మహబూబ్‌నగర్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. ‘ అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
‘ ఇవాళ మహబూబ్‌నగర్‌కు ఇచ్చే పాలమూరు ఎత్తిపోతలు కొత్త స్కీం కాదు.. గతంలోనే 174 టీఎంసీలకు రూపకల్పన జరిగింది. దీనిపై ఉద్యమం సమయంలోనే బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు వెళ్లామని గుర్తుచేశారు. కానీ రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది కాబట్టి.. అప్పుడు మా వినతిని తిరస్కరించారు. సమైక్య పాలనలో పాలమూరుకు గంటెడు నీళ్లు అడిగినోళ్లు లేరు. అనంతరం బచావత్ సుమోటోగా 17 టీఎంసీలు జూరాలకు మంజూరు చేశారు. సాంకేతిక కారణాలు, ఇతరత్రా చూపించి జూరాల ఇక్కడి నుంచి ఎత్తగొట్టద్దు.. వేరే దగ్గర కట్టవద్దని ఒక కండిషన్ పెట్టారు. 1974-78 మధ్య కేటాయిస్తే దాన్ని పట్టించుకున్న వాళ్లెవరూ లేరు. అంజయ్య ముఖ్యమంత్రి అయ్యాక దానికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి దాన్ని పట్టించుకోలేదు. ఒక అనాథలా బ్యారేజి వరకు కట్టేశారు. దానికి కాల్వలు లేవు.. నీళ్లు రావు.. పొలాలు పారయి.. కృష్ణా నది నీళ్లు వస్తాయి.. గేట్ల ద్వారా పోతాయి. 2001లో గులాబీ జెండా ఎగిరే దాకా ఇదే పరిస్థితి ఉంది.’ అని కేసీఆర్ వివరించారు.
‘ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు.. దాన్ని అభివృద్ధి చేస్తానని మాటలు చెప్పి, ఇష్టమొచ్చినన్ని పునాది రాళ్లు వేశారు. ఉద్యమ సమయంలో ఈ పునాది రాళ్లపై మాట్లాడాను. ఈ పునాది రాళ్లు అన్ని ఎందుకు.. పట్టుకుని ఏడ్చేందుకా? వాటన్నింటినీ పట్టుకెళ్లి కృష్ణానదిలో అడ్డం వేస్తే చెక్‌డ్యామ్ అయినా అవుతదని చెప్పేవాడిని. ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలేదు. దీంతో పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి ముంబైకి పొట్టచేత పట్టుకుని వలసలు పోయారు. దీనిపై జిల్లాకు చెందిన అనేక కవులు పాటలు రాశారు. రెండు ప్రాజెక్టులు పెడితే రెండింటినీ నిర్లక్ష్యం చేశారు. అప్పట్లో చంద్రబాబు ఒక స్లోగన్ ఇచ్చారు.. సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి. జూరాల కొంత ముంపు ప్రాంతం కర్ణాటకలో ఉంటది. రూ.13 కోట్లు వాళ్లకు పరిహారం కట్టాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు కట్టడు. దీనిపై మహబూబ్‌నగర్ టౌన్లో జరిగిన ప్రథమ మహాసభలో నిలదీశా. అప్పుడు మోకాళ్ల మీద పరిగెత్తి జూరాల ప్రాజెక్టు కట్టాడు. ఆ తర్వాత తెలుగు దేశం ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ కెనాల్‌ను బాంబులు పెట్టి పేల్చేసిండు.’ అని కేసీఆర్ తెలిపారు.
‘ తెలంగాణ ఉద్యమం ఎంచుకున్న తర్వాత చేసిన తొలి పాదయాత్ర జోగులాంబ నుంచి గద్వాల చేశా. ఈ అన్యాయం సంగతేంటని, ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ఈ పాదయాత్ర చేశా. 80 వేల ఎకరాలకు పారాల్సిన ఆర్డీఎస్ కెనాల్ 10 వేల ఎకరాలకు వచ్చింది.. అయినా అడిగే నాథుడు లేడు. ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ ఉన్న రాయచూర్ నుంచి కాల్వ మొత్తం తిరిగి.. దాన్ని అర్థం చేసుకుని ఈ పాదయాత్ర చేశా. అలా దాన్ని గొడవ చేస్తే.. జూరాల నుంచి ఆర్డీఎస్కు లింక్ కెనాల్ పెట్టారు. ఇలా ప్రతిసారి ఏమార్చడం, తెలంగాణ ప్రజలను దగా చేయడం తప్ప ఒక్క చుక్క నీరు రాలేదు. సరే అని కొట్లాడుతూ వెళ్లాం.. ప్రజలందరూ కలిసి వచ్చారు.. అదృష్టం బాగుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ‘ అని కేసీఆర్ తెలిపారు.
పాలమూరు జిల్లా దరిద్రం.. ఆ దరిద్రంలోకి పాలమూరును నెట్టివేయబడ్డ పరిస్థితి.. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు.. వెనుకపడేయబడ్డ ప్రాంతమని ఎప్పుడూ చెబుతూ ఉండేవాడిని అని కేసీఆర్ గుర్తుచేశారు. పాలమూరులో ఎండాకాలం వస్తే గంజి కేంద్రాలు పెట్టేవాళ్లు. ఆ పరిస్థితి చూసి ఏడ్చేవాళ్లమని తెలిపారు. ‘ కృష్ణా నది 300 కి.మీ. పారే మహబూబ్‌నగర్ జిల్లా అంతగా దిగజారిపోయింది. కేటాయింపులు లేవా ఉంటే ఉన్నాయి.. రకరకాల ప్రాజెక్టులు ఉంటాయి.. కానీ రావు.. చూడ్డానికి ముఖ్యమంత్రి దత్తత జిల్లాగా ఉంటది.. కానీ ఏవీ రావు.. రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం సమీక్ష చేసుకున్నాం.. మనకు రావాల్సిన వాటా ఎంత? దగా ఎక్కడ జరిగింది? ఎలా సరిదిద్దాలని ఆలోచన చేశాం. మహబూబ్‌నగర్ జిల్లాను ఆదుకోవాలని ప్రస్థానం ప్రారంభించాం. యుద్ధప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ చేశాం. నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి అన్నింటినీ లైన్లోకి తెచ్చాం. నికరంగా ఆరున్నర లక్షల ఎకరాలకు ఆయకట్టు తెచ్చాం. అలాగే అనేక చెక్‌డ్యామ్‌లు కట్టాం. ఆర్డీఎస్ కెనాల్ మోసం జరిగింది కాబట్టి తుంగభద్ర మీద పెట్టి తుమ్మిళ్ల లిఫ్ట్ తెచ్చి, పూర్తి చేశాం. ఆయకట్టు పారిపించాం. మిషన్ కాకతీయలో టాప్ ప్రియారిటీ ఇచ్చి మైనర్ ఇరిగేషన్ చెరువుల సామర్థ్యాలను పెంచాం. అలా 1.5 లక్షల ఎకరాలకు దోహదపడింది.’ అని కేసీఆర్ తెలిపారు.
‘ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో కురిసే ప్రతి వర్షం చుక్క కృష్ణా నదిలోకే వెళ్తుంది.. ఇవి కృష్ణా బేసిన్లో ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో జరిగిన మోసం నుంచి బయటపడాలంటే కొట్లాడి మన వాటా మనం సాధించుకోవాలి.. కృష్ణా జలాల పునఃపంపిణీపై ట్రిబ్యునల్ వేయించాలని స్ట్రాటజీతో వెళ్లాం. ఈ ప్రాజెక్టులను పూర్తిచేస్తూనే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాం.ఈ పథకానికి 173 టీఎంసీలు తీసుకోవాలనేది బీఆర్ఎస్ స్ట్రాటజీ. ఎలా తీసుకోవాలంటే అనేక ఆంక్షలు, ఏపీ నుంచి వచ్చే వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని నికరంగా లెక్కలు తెప్పించాం. మహబూబ్‌నగర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్లో బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఉన్న చెరువులెన్నీ.. ఇప్పుడున్నవెన్నీ అనేది లెక్కలు తీయించి, కేంద్రానికి సమర్పించాం. ఆనాడు పాలమూరు ప్రాజెక్టుకు 90.81 టీఎంసీలు కేటాయించాం.. ఇంకా వాటా వచ్చేది ఉంటే అందులో వచ్చే నీటిని దీనికే అటాచ్ చేస్తామని 173 టీఎంసీలు తీసుకోవాలని అనుకున్నాం. బచావత్ ట్రిబ్యునల్‌లో ఒక నిర్ణయం స్పష్టంగా ఉంది. ఆంధ్రావాళ్లు మొదట్నుంచి గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు తెచ్చుకుంటామని తెచ్చుకున్నారు. దానిలో భాగంగానే 80 టీఎంసీలు తీసుకున్నరు. 80 టీఎంసీలు తీసుకుంటున్నాం కాబట్టి పైన రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ ద్వారా ఇస్తామని వాళ్లు డీపీఆర్‌లో స్పష్టంగా చెప్పారు. అది తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఇస్తారు.. అందులో తెలంగాణకు 45, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీలు ఇవ్వాలి. కర్ణాటక, మహారాష్ట్ర వాళ్లు ఆ నీటిని వాడుకుంటున్నారు.. ట్రిబ్యునల్ కేటాయించిన 45 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్లో నష్టపోయిన 45 టీఎంసీలు కలిపి 90.81 టీఎంసీలకు దాన్ని ప్రతిపాదించాం. ప్రాజెక్టుకు 35 వేల కోట్లు మంజూరు చేశాం. అందులో 27 వేల కోట్లు ఖర్చు చేసి 88-90 శాతం పనులు పూర్తి చేశాం. ఆంధ్రాతో పంచాయితీ ఉంటుందని.. వీలైనంత తొందరగా నీటిని తీసుకోవాలని 145 మెగావాట్ల కెపాసిటీ పంప్‌లను పెట్టాం. వాటిని బీహెచ్ఈఎల్ ప్రత్యేకంగా రూపొందించి ఇచ్చింది. తర్వాత అనుమతులపై అనేక అనేక మెలికలు పెట్టారు. భూసమీకరణలో ఇబ్బందులు తెచ్చారు.. అయినా 27వేల ఎకరాలకు సమీకరించాం.’ అని కేసీఆర్ వివరించారు.