AP News | అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం నెలకొంది. మెకానిక్ చెప్పాడని రాత్రంతా బైక్ ఇంజిన్ ఆన్‌లో పెడితే.. దాని నుంచి వచ్చిన పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. తాత, మనమడు, ఇద్దరు మనమరాళ్లు మృతిచెందడంతో అక్కడ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. అన్నమయ్య జిల్లా పుంగనూరులోని త్యాగరాజు వీధికి చెందిన మురళి, రేవతి భార్యాభర్తలు. తండ్రి రామచంద్రయ్య, కుమారుడు కార్తీక్, కవల కుమార్తెలు చరిత, చందన ఉన్నారు. మురళి శనివారం తన ద్విచక్రవాహనాన్ని మెకానిక్ వద్ద మరమ్మతు చేయించాడు. ఇంజిన్ సమస్య ఉండటంతో బోర్ చేయించిన అనంతరం బైక్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. అయితే రాత్రంతా ద్విచక్ర వాహనం స్టార్టింగ్‌లో ఉంచాలని మెకానిక్ చెప్పాడు.
మెకానిక్ ఇచ్చిన అనాలోచిత సలహాతో మురళి ఇంట్లో తలుపులు వేసి, ఇంజిన్‌ను ఆన్ చేశాడు. శనివారం రాత్రి తండ్రి, మనుమడు, మనమరాళ్లు ఇంట్లో నిద్రించగా.. మురళి, రేవతి ఇంటిపైన గదిలో పడుకున్నారు. ఇల్లు ఇరుకుగా ఉండటంతో పాటు.. మరోవైపు గాలి బయటకు వెళ్లే వీలు లేకపోవడంతో రాత్రంతా బైక్ నుంచి వెలువడిన పొగ గదిలో వ్యాపించింది. దీంతో తాత, మనుమడు, మనుమరాళ్లు ఆ పొగ పీల్చి మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి.