లక్నో: ఒక మహిళను ఆమె అత్తమామలు వేధించారు. అదనపు కట్నం కోసం షాకింగ్ డిమాండ్ చేశారు. (Shocking Dowry Demand) భర్త అనారోగ్యంగా ఉండటంతో కిడ్నీ దానం చేయాలని కోడలిని డిమాండ్ చేశారు. దీని కోసం ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అత్తంటి వారి వేధింపులకు విసిగిపోయిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. మిథన్పూర్కు చెందిన దీప్తికి 2021లో పార్థ్ ప్రషార్తో పెళ్లి జరిగింది. 2023లో భర్తకు కిడ్నీ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో పార్థ్ ప్రషార్ను చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు. దీప్తి కూడా ఢిల్లీలోని ప్రషార్ సోదరి ఇంట్లో మూడు నెలలు ఉన్నది. అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకున్నది. అనంతరం ఆ జంట ఢిల్లీలోని అద్దె ఇంట్లో నివసించారు.
కాగా, దీప్తిని అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించారు. భర్త పార్థ్ ప్రషార్ కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నందున కిడ్నీ దానం చేయాలని లేదా రూ.4 లక్షలు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీని కోసం దీప్తిని ఇంటి నుంచి పంపివేశారు. కొంతకాలం పుట్టింట్లో ఉన్న దీప్తి మే 11న తిరిగి భర్త ఇంటికి వెళ్లింది. అయితే తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆమెను ఇంట్లోకి అనుమతించబోమని అత్తమామలు తెగేసి చెప్పారు.
మరోవైపు దీప్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి సమయంలో తన తండ్రి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిపింది. పెళ్లి తర్వాత డబ్బు, బైక్ డిమాండ్ చేశారని, ఆయుర్వేద షాపు ఏర్పాటు కోసం రూ.7 లక్షలు డిమాండ్ చేయగా మూడు లక్షలు ఇచ్చినట్లు చెప్పింది. తాజాగా తన కిడ్నీ దానంతోపాటు మిగతా నాలుగు లక్షలు డిమాండ్ చేస్తున్నారని దీప్తి ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: