UPI Payments | ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్ చెల్లింపులే (UPI Payments) జరుగుతున్నాయి. చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తంలో యూపీఐ ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం తదితర యాప్స్ సహాయంతో డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. టీ దుకాణంలో రూ.10 పెట్టి ఛాయ్ తాగినా సరే యూపీఐ చేసేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వం యూపీఐ డిజిటల్ చెల్లింపులను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. అయితే, త్వరలోనే యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చెంట్ ఛార్జీల (Merchant Charges)ను విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (Merchant Discount Rate)ను తిరిగి ప్రవేశపెట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మర్చంట్ టర్నోవర్ కంటే ట్రాన్సాక్షన్ విలువ ఆధారంగానే ఛార్జీలను వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. రూ.3 వేల కంటే ఎక్కువ ఉన్న అన్ని యూపీఐ చెల్లింపులపై ఈ ఛార్జీలను విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. చిన్న మొత్తాలపై మాత్రం ఎలాంటి ఫీజులు ఉండవని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక సేవల విభాగం ఉన్నతాధికారుల మధ్య చర్చల దశలో ఉన్నట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంటోంది.
దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు యూపీఐ, రూపే లావాదేవీలపై అన్ని రకాల ఎండీఆర్ ఛార్జీలను ప్రభుత్వం 2022లో రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఛార్జీలను తిరిగి తీసుకురావడం వల్ల యూజర్లపై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ లావేదేవీల కోసం యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోరు. కాకపోతే దీనివల్ల వ్యాపారులు మళ్లీ నగదు చలామణికి మొగ్గు చూపే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రికార్డుస్థాయికి యూపీఐ లావాదేవీలు
యూపీఐ.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI). నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) దీనిని అభివృద్ధి చేసింది. డిజిటల్ పేమెంట్స్‌లో యూపీఐ సరికొత్త విప్లవం సృష్టించిందని చెప్పొచ్చు. ఇక ఈ ఏడాది యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మే నెలలో రూ.25.14 లక్షల కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఎన్పీసీఐ వెల్లడించింది. అంతక్రితం నెలలో జరిగిన రూ.23.94 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఐదు శాతం అధికమయ్యాయని తెలిపింది. సంఖ్యపరంగా చూస్తే 1,867.7 కోట్ల లావాదేవీలు జరిపారు. అలాగే ఏప్రిల్ నెలలో ఇది 1,789.3 కోట్ల లావాదేవీలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలలో జరిగిన రూ.20.44 లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలతో పోలిస్తే మాత్రం 23 శాతం వార్షిక వృద్ధి నమోదైందని పేర్కొంది.
Also Read..
హైదరాబాద్‌లో ఆల్కార్గో గతి ఎయిర్ డెలివరీ సేవలు
ఈక్విటీ ఫండ్లకు తగ్గుతున్న గిరాకీ