న్యూఢిల్లీ/ముంబై, జూన్ 10: దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్)కు గిరా కీ తగ్గిపోయింది. గత నెలలో వచ్చిన పెట్టుబడులు 13 నెలల కనిష్ఠానికి దిగజారాయి. మే నెలలో రూ.19,013 కోట్లకు పరిమితమయ్యాయి. 2024 ఏప్రిల్ తర్వాత ఈ స్థాయిలోనే ఉండటం ఇదే తొలిసారి. నాడు రూ.18,917 కోట్లు వచ్చాయి. కాగా, ఈసారి లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ అన్నింటిలోకి ఇన్వెస్ట్మెంట్లు పడిపోవడం గమనార్హం. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడమే కారణమని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. అలాగే సూచీలు కన్సాలిడేషన్ దశలోకి వెళ్తుండటం కారణమేనంటున్నారు.
వరుసగా ఐదో నెల
ఈక్విటీ ఫండ్స్‌ల్లోకి పెట్టుబడులు క్షీణించడం వరుసగా ఇది ఐదో నెల. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే మే నెలలో దాదాపు 22 శాతం పతనం కనిపిస్తున్నట్టు మంగళవారం భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) తెలిపింది. ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి నెలవారీగా ఎంతోకొంత పెట్టుబడులు రావడం మాత్రం ఇది (మే) 51వ నెల.
సిప్‌లకు ఆదరణ
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌కు ఇన్వెస్టర్లలో ఆదరణ బాగానే కనిపిస్తున్నది. మే నెల లో రూ.26,688 కోట్లు వచ్చాయి. ఏప్రిల్‌లో రూ.26,632 కోట్లుగా నమోదయ్యాయి.
సెన్సెక్స్ లాభాలకు బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ స్వల్పంగా లాభపడింది. సెన్సెక్స్ 53.49 పాయింట్లు పడిపోయి 82,391.72 వద్ద ముగిసింది. అయితే 1.05 పాయింట్లు పెరిగి 25,104.25 వద్ద నిఫ్టీ నిలిచింది. నిజానికి అంతకుముందు 4 రోజులపాటు రెండు సూచీలు లాభాల్లోనే స్థిరపడ్డ విషయం తెలిసిందే. దీంతో వరుస లాభాలకు బ్రేక్ పడినైట్టెంది. కాగా, ఐటీ, యుటిలిటీస్, పవర్, టెక్నాలజీ, హెల్త్‌కేర్, కమోడిటీస్ షేర్లు పెరిగాయి. రియల్టీ, టెలికం, ఆర్థిక సేవలు తదితర రంగాల షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.33 శాతం, స్మాల్‌క్యాప్ 0.04 శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్ షేర్లలో ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ, ఆర్ఐఎల్ షేర్లు నష్టపోయాయి.
మే నెలలో పెట్టుబడుల తీరిది..