Shibu Soren | జార్ఖండ్ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ (Shibu Soren) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 81 ఏండ్లు. శిబు సోరెన్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో అనారోగ్యంతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
శిబు సోరెన్ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, మూడుసార్లూ ఆయన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదు. మార్చి 2005లో ఆయన సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అయితే, తొమ్మిది రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2008 ఆగస్టులో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కేవలం ఐదు నెలలు మాత్రమే అంటే 2009 జనవరి వరకూ ఆ కుర్చీలో కొనసాగారు. ఆ తర్వాత 2009 డిసెంబర్ నుంచి మే 2010 వరకూ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 2006 వరకూ కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. ఆరుసార్లు లోక్‌సభ ఎంపీగా, మూడు సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. శిబు సోరెన్ మరణ వార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు.
జీవితమే ఓ పోరాటం
జార్ఖండ్‌లోని సారవంతమైన గిరిజనుల భూములన్నీ బీహార్ మైదానప్రాంతం నుంచి వచ్చిన భూస్వాములు, వడ్డీ వ్యాపారులు ఆక్రమించి దోపిడీకి పాల్పడుతుండటంతో చిన్నతనంలోనే శిబు సొరేన్ తిరుగుబాటు చేశారు. 18 ఏండ్ల వయసులో సంతాల్ నవయువక్ సంఘ్ అనే సంస్థను స్థాపించారు. 1972లో బెంగాల్ కమ్యూనిస్టు నాయకులు ఏకే రాయ్, కుర్మి మహతో నాయకుడు బినోద్ బిహారీ మహతో కలిసి జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీని స్థాపించారు.
గిరిజనుల హక్కుల కోసం ఎడతెగని పోరాటం చేశారు. ఈ క్రమంలో అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు. అయినా ఆయన లక్ష్యం సాధించేవరకు వెనుదిరగలేదు. స్వరాష్ర్టాన్ని సాధించి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీహార్ భూస్వాములు, దోపిడీదారులు, వలసవాదుల నుంచి గిరిపుత్రులకు సొంత రాష్ర్టాన్ని, స్వయం పాలనను సాధించిపెట్టిన నాయకుడు శిబు సోరెన్. మహామహా ఉద్ధండ పిండాల్లాంటి రాజకీయ నాయకులు కూడా దిగొచ్చి జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు స్వయంగా అంగీకరించేలా చేసిన గొప్ప చతురత కలిగిన నాయకుడు శిబు సొరేన్. అయినా ఆయన లక్ష్యం సాధించేవరకు వెనుదిరగలేదు. స్వరాష్ర్టాన్ని సాధించి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
తెలంగాణకు తొలి మద్దతు శిబుదే
జార్ఖండ్లోలాంటి అణచివేత, అన్యాయాలపై తిరగబడి పోరాడిన తెలంగాణకు శిబు సొరేన్ అన్నివేళలా మద్దతుగా నిలిచారు. కే చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న సమయంలో అనేకసార్లు తెలంగాణకు వచ్చి సభల్లో పాల్గొన్నారు.
Also Read..
DK Shivakumar | కొందరు అధికారాన్ని పంచుకునేందుకు ఇష్టపడరు: డీకే శివకుమార్
ట్రంప్‌కు తలొగ్గిన మోదీ సర్కార్!.. రష్యా నుంచి చమురు దిగుమతులు కట్!
తల్లి బాగోగులు కుమారుడి బాధ్యత.. దాతృత్వం కాదు