న్యూఢిల్లీ, ఆగస్టు 3: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు లొంగిపోయిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాలా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. గత ఏప్రిల్‌లో ట్రంప్ చేసిన సుంకాల ప్రకటనతో బెదిరిపోయిన మోదీ ప్రభుత్వం అమెరికా నుంచి ముడి చమురు కొనుగోళ్లను రెట్టింపు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమెరికా నుంచి ముడి చమురు కొనుగోళ్లు 114 శాతం పెరగడం విశేషం. 2024 ఏప్రిల్, జూన్ మధ్య త్రైమాసికంలో అమెరికా నుంచి దాదాపు రూ. 15,000 కోట్ల విలువైన చమురును భారత్ కొనుగోలు చేసింది. 2025 ఏప్రిల్, జూన్ మధ్య ఈ మొత్తం రూ. 32,000 కోట్లకు చేరుకుందని వర్గాలు వెల్లడించాయి.
2025 జనవరి, జూన్ మధ్య అమెరికా నుంచి రోజుకు 2,71,000 బ్యారెళ్ల ముడి చమురును భారత్ కొనుగోలు చేసింది. 2024లో అదే కాలంలో రోజుకు 1,80,000 బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలు జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 51 శాతం పెంపును సూచిస్తోంది. ఈ ఏడాదిలో ఒక్క జూలై నెలలోనే జూన్‌తో పోలిస్తే అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులలో 23 శాతం పెరుగుదల ఉంది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం ముడి చమురులో అమెరికా వాటా 3 శాతం నుంచి 8 శాతానికి పెరగడం గమనార్హం.
రష్యా నుంచి సైనిక పరికరాలు, చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు జూలై 30న ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్‌లో ప్రజలను చంపడం రష్యా ఆపాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నప్పటికీ భారత్ మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగిస్తూనే ఉందని, ఇది మంచిది కాదని ట్రంప్ అన్నారు. రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నందుకు ఆగస్టు 1 నుంచి భారత్ 25 శాతం సుంకం, జరిమానా కట్టాలని ప్రకటించారు. ప్రస్తుతం భారత్ తన చమురు అవసరాలలో సుమారు 40 శాతాన్ని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. రష్యా నుంచి ప్రతిరోజు 11.50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును భారత్ ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నది.
అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్లు, పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ దాదాపు నిలిపివేసిందని రాయిటర్స్ వార్తాసంస్థ కథనం పేర్కొంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటి భారతీయ చమురు కంపెనీలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేశాయని తెలిపింది. రాయితీలు తగ్గడం, సరకు రవాణాలో ఇబ్బందులు తలెత్తడమే ఇందుకు కారణమని వార్తాసంస్థ పేర్కొంది. రష్యా నుంచి ముడి చమురును 2022 నుంచి కొనుగోలు చేస్తున్నా మొట్టమొదటిసారి అతి తక్కువ రాయితీ ఇప్పుడే లభిస్తున్నదని, దీంతో రష్యా నుంచి కొనుగోళ్లను భారతీయ చమురు సంస్థలే నిలిపివేశాయని వార్తాసంస్థ పేర్కొంది. అయితే, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.
రష్యా నుంచి ఇక ఎక్కువ కాలం చమురును భారత్ కొనుగోలు చేయదని వార్తలు వస్తున్నాయని, అయితే ఈ వార్తలలోని నిజానిజాలు తనకు తెలియవని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే జరిగితే మంచి విషయమేనని అన్నారు. తర్వాత ఏం జరుగుతుందో వేచి చూద్దామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందిస్తూ.. భారత చమురు అవసరాలకు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఆధారంగా, అప్పటి అంతర్జాతీయ పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేశారా లేదా అన్నది సూటిగా సమాధానం చెప్పలేదు.
అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా నుంచి ముడి చమురు, రక్షణ పరికరాల దిగుమతులను భారత్ పూర్తిగా నిలిపివేసిన పక్షంలో భారత్ చమురు దిగుమతి ఖర్చులు ఏటా 1100 కోట్ల డాలర్లకు (దాదాపు 95 వేల కోట్లు) పెరుగుతాయని నిపుణులు హెచ్చరించారు. ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద చమురు దిగుమతిదారైన భారత్ భారీ రాయితీతో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుని గణనీయ స్థాయిలో ప్రయోజనం పొందింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తిన నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన దరిమిలా భారత్ రష్యా నుంచి తన కొనుగోళ్లను పెంచింది. ఈ యుద్ధానికి ముందు తన మొత్తం చమురు దిగుమతిలో భారత్ కేవలం 0.2 శాతం మాత్రమే రష్యా నుంచి కొనుగోలు చేసేది. 2022 తర్వాత ఇది 35 నుంచి 40 శాతానికి పెరిగింది.