ఢిల్లీ: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అధికార పంపిణీ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సీఎం కుర్చీ ప్రస్తుతం ఖాళీ లేదు.. ఐదేండ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఇప్పటికే సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొందరు అధికారాన్ని పంచుకోవడానికి ఇష్టపడరంటూ ఉపముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యాక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను కష్టపడ్డానని చెప్పారు. రాజకీయాల్లో అధికార పంపిణీ గురించి ప్రస్తావిస్తూ గాంధీ కుటుంబాన్ని పొగుడుతూనే, కాంగ్రెస్లో తన సుదీర్ఘ ప్రయాణాన్ని వివరించారు.
2004లో సోనియాను ప్రధానిగా ప్రమాణం చేయాలని రాష్ట్రపతి అడిగినప్పుడు, ఆమె తనకు అధికారం ముఖ్యం కాదని చెప్పారని డీకే గుర్తుచేశారు. ఒక సిక్కు, మైనారిటీ, ఆర్థికవేత్త అయిన వ్యక్తి దేశాన్ని రక్షించగలడని నిర్ణయించి, అతన్ని ప్రధానమంత్రిని చేశారని తెలిపారు. ఇది రాజకీయాల్లో అసాధారణమైన త్యాగమని, ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఇలాంటి త్యాగం ఎవరూ చేయలేదని కొనియాడారు. ప్రస్తుత రోజుల్లో చిన్న పదవిని కూడా ఎవరైనా త్యాగం చేస్తారా అని ప్రశ్నించారు. పంచాయతీ స్థాయిలో కూడా చాలామంది అలా చేయరని వెల్లడించారు. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారాన్ని పంచుకుంటారు. కానీ మనలో కొందరు దానికి ఒప్పుకోరని చెప్పారు. ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా, సిద్ధరామయ్యను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది.
ఎమ్మెల్యేలతో సిద్ధూ సమావేశాలు.. డీకే దూరం!
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగుతున్న వేళ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం సిద్ధరామయ్య సమావేశాలు నిర్వహిస్తుండగా, వీటికి డీకేను పక్కనబెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనుల నిమిత్తం ఇటీవలే ఎమ్మెల్యేలకు రూ.100 కోట్ల చొప్పున సీఎం సిద్ధరామయ్య నిధులు కేటాయించారు.
జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలకు డీకే దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇలాంటి సమావేశాలు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జరుగుతాయి. అయితే ఈసారి విధాన సౌధలో సీఎం చాంబర్లో జరుగుతుండటం గమనార్హం. డీకేను దూరం పెట్టేందుకే ఉద్దేశ పూర్వకంగా ఇలా చేశారన్న ప్రచారం సాగుతున్నది.
“ఐదేండ్లూ నేనే సీఎం ఇవ్వడానికి కుర్చీ ఖాళీ లేదు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య”
“ప్రజలు నన్ను సీఎంగా చూడాలనుకుంటున్నారు.. డీకే శివ కుమార్”
“నాకు వేరే గత్యంతరం లేదు.. అధిష్టానం చెప్పినట్టు సిద్ధరామయ్యకు మద్దతు ఇవ్వాల్సిందే: డీకే శివకుమార్”