బెంగళూరు, జూలై 10: కర్ణాటకలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్ఠానం మారుస్తుందని, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను సీఎంను చేస్తారంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెరదించారు. రాష్ట్రంలో ఐదేండ్ల పాటు పూర్తికాలం తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, డీకేను సీఎంను చేయడానికి పదవి నుంచి దిగిపొమ్మని అధిష్ఠానం తనను అడిగినట్టు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.
‘ఐదేండ్ల పాటు నేనే సీఎంగా ఉంటా. ఈ విషయం నేను ఎప్పుడో స్పష్టం చేశా. జూలై 2న చేసిన ప్రకటనలో కూడా ఇదే విషయం చెప్పా. ఆ రోజు నా పక్కన శివకుమార్ కూడా ఉన్నారు’ అని పేర్కొన్నారు. సీఎం పదవిపై డీకే ఆశపడుతున్న విషయంపై ఆయన మాట్లాడుతూ ‘డీకే కూడా ఈ పదవికి ఆశావహుడే. అందులో ఎలాంటి తప్పూ లేదు. ఆయన కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. కానీ సీఎం కుర్చీ ప్రస్తుతం ఖాళీ లేదు’ అని చెప్పారు.