టెహ్రాన్, మార్చి 10: ఇరాన్ ఏమన్నా అతిగా వ్యవహరించినా, అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యాలపై మరిన్ని దాడులకు దిగినా వ్యూహాత్మకంగా కీలకమైన హొర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. జలమార్గాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే దానిని సొంతం చేసుకుంటామన్నారు. ‘వారు ఏదన్నా చెడుగా వ్యవహరిస్తే ఇరాన్ అంతం అయినట్టే. ఇకపై మీరు ఇరాన్ పేరునే వినబోరు’ అని అన్నారు. ప్రస్తుతం హొర్ముజ్ జలసంధిని తెరిచారని, అందులోకి నౌకలు ప్రవేశించాయని అన్నారు. తర్వాత ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘హొర్ముజ్ జలసంధి మీదుగా చమురు రవాణాను ఇరాన్ అడ్డుకుంటే ఇప్పటివరకు వారు నష్టపోయిన దానికన్నా 20 రెట్లు నష్టం కలిగిస్తాం’ అని హెచ్చరించారు. ఇరాన్‌పై యుద్ధం స్వల్పకాలికం కావచ్చునని ట్రంప్ అన్నారు. చమురు సరఫరాలో 20 శాతం ఈ జలసంధి మీదుగానే రవాణా అవుతున్న క్రమంలో ఇరాన్ హెచ్చరికలతో భారీయెత్తున నౌకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ట్రంప్ సీబీఎస్ న్యూస్‌తో ఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘యుద్ధం చాలా వరకు పూర్తయిపోయిందని అనుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు.
హొర్ముజ్ జలసంధిపై ట్రంప్ చేసిన హెచ్చరికలను ఇరాన్ బేఖాతరు చేసింది. తమపై దాడులు కొనసాగితే పశ్చిమాసియా నుంచి ఒక్క లీటర్ చమురును కూడా హొర్ముజ్ ద్వారా రవాణా కానీయబోమని హెచ్చరించింది. ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటలకే ఇరాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ హొర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే చమురు ట్యాంకర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగినంత కాలం చమురు రవాణాను హొర్ముజ్ మీదుగా అనుమతించబోమని మంగళవారం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) స్పష్టం చేసింది.
అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధం ఎప్పుడు ముగించాలో నిర్ణయించేది ఇరానే తప్ప అమెరికా ఎంతమాత్రం కాదని ఐఆర్జీసీ తెగేసి చెప్పింది. ఇరాన్ సంక్షోభం త్వరలోనే ముగుస్తుందని ట్రంప్ చేసిన ప్రకటనపై వారు తీవ్రంగా స్పందించారు. ‘అమెరికన్, ఇజ్రాయెల్ లక్ష్యాలపై చర్యలు ఎప్పుడు ఆగిపోవాలో నిర్ణయించేది మేమే. ఈ ప్రాంతం సమీకరణలు, భవిష్యత్ స్థితి ఇప్పుడు టెహ్రాన్ దళాల చేతుల్లో ఉంది. అమెరికా దళాలు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి అంతం పలకలేవు’ అని ఐఆర్జీసీ స్పష్టంచేసింది.