బెంగళూరు : కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య బుధవారం పునరుద్ఘాటించిన దరిమిలా తనకు వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిర్వేదంగా వ్యాఖ్యానించారు. ‘నాకు వేరే ప్రత్యామ్నాయం ఏముంది? ఆయన(సీఎం) పక్కన నేను ఉండక తప్పదు.. ఆయనకు మద్దతు ఇవ్వక తప్పదు. అధిష్టానం ఏం చెబితే నేను దాన్ని పాటించాల్సిందే’ అని బుధవారం సిద్ధరామయ్య సమక్షంలోనే విలేకరుల సమావేశంలో డీకే వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
డీకేను ముఖ్యమంత్రిని చేయాలని పలువురు పార్టీ నాయకులు చేస్తున్న డిమాండును విస్మరిస్తూ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యే కొనసాగుతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా ప్రకటించిన తర్వాత కర్ణాటకకు చెందిన ఇద్దరు అగ్రనాయకులు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సిద్ధరామయ్య మాట్లాడుతూ తాను ఐదేళ్లు పూర్తికాలం ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటానని స్పష్టం చేశారు.