కోచి, ఆగస్టు 3 : శతాధిక వృద్ధురాలైన తల్లికి పోషణ ఖర్చుల కింద నెలకు రూ.2 వేలు చెల్లించాలంటూ ఆమె కుమారుడిని ఆదేశిస్తూ ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఆదేశాలను కేరళ హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు 57 ఏండ్ల కుమారుడికి చీవాట్లు పెట్టింది. తల్లి బాగోగులు చూడకపోవడంపై సిగ్గుపడాలని జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ వ్యాఖ్యానించారు. తల్లిని సంరక్షించడం ప్రతి కుమారుడి విధి అని, అది దాతృత్వం కాదని పేర్కొన్నారు. ఫ్యామిలీ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పిటిషనర్ దాఖలు చేసిన అప్పీల్‌ను జడ్జి కొట్టివేశారు. శతాధిక వృద్ధురాలైన తల్లి నిర్వహణ ఖర్చుల కింద నెలకు రూ.5 వేలు కావాలని కోరడం, ఆమెకు అంత అవసరం లేదంటూ దానిని చెల్లించడానికి కొడుకు నిరాకరించడం, దానిపై కోర్టు కెక్కడం చూస్తుంటే ఈ సమాజంలోని సభ్యుడిగా తాను సిగ్గు పడుతున్నానని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
తల్లిని చూడటం కుమారుడిగా పిటిషనర్ బాధ్యత అని, అలా చేయకపోతే అతడు మనిషే కాదని అన్నారు. తల్లిదండ్రులు వృద్ధులవుతున్న కొద్దీ వారి అభిరుచులు, వైఖరి, స్వభావాలు తేడాగా ఉండవచ్చునని పేర్కొన్నారు. వయసు పెరిగే కొద్దీ వారిలో చిన్న పిల్లల స్వభావం వస్తుందని, చిన్నప్పుడు మనల్ని కూడా తల్లి సహనంతో భరించి పెంచిన విషయాన్ని మరువరాదని అన్నారు. వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల కూడా మనం అదే తరహాలో సహనంతో ఉండాలని న్యాయమూర్తి హితవు పలికారు.