సారంగాపూర్, ఫిబ్రవరి 27 : యూరియా బుకింగ్ తెలియక రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. యూరియా కోసం బుకింగ్ చేసుకునేందుకు లాగిన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందోనని సెల్ఫోన్ చేతిలో పట్టుకొని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్ రూరల్ మండలంలోని ముత్తకుంట సొసైటీ పరిధిలోని రైతులు యూరియా కోసం గురువారం ఆందోళన చేపట్టగా, జిల్లా అధికారులు స్పందించి శుక్రవారం యూరియా పంపిణీకి చర్యలు తీసుకున్నారు. రైతులకు ఒకరోజు ముందుగానే సమాచారం ఇవ్వడంతో ఉదయం 9 గంటలకే సొసైటీ కార్యాలయానికి చేరుకున్నారు.
యూరియా బుకింగ్ చేసుకునేందుకు లాగిన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందోనని సెల్ఫోన్ చేతిలో పెట్టుకొని ఎదురుచూశారు. సిగ్నల్ రావడం లేదని కొందరు రైతులు సిగ్నల్ వచ్చే ప్రదేశానికి పరుగులు తీసి బుకింగ్ చేసుకున్నారు. మరికొందరు రైతులు బుకింగ్ ఎలా చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న విద్యావంతుల వద్దకు వెళ్లి బుకింగ్ చేయాలని వేడుకోవాల్సి వచ్చింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతుల్లో బుకింగ్ చేసుకున్న 450 మందికి యూరియా బస్తాలు అందజేసినట్లు సొసైటీ సీఈవో రాము తెలిపారు. యూరియా అందని వారు నిరాశ పడొద్దని, మరో 450 బస్తాల యూరియా వస్తుందని శనివారం పంపిణీ చేస్తామని చెప్పారు.