నంగునూరు, ఫిబ్రవరి 27: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరానికైనా నీళ్లు అందుతున్నా యా అని ప్రశ్నిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మైసంపల్లి గ్రామానికి వచ్చి ఇకడి పచ్చని పొలాలను చూడాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్‌రావు హితవు పలికారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మైసంపల్లి, వెంకటాపూర్ గ్రామా ల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
మైసంపల్లిలో ప్రెద్దమ్మ తల్లి వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ… పారుతున్న కాలువలు, పచ్చని పంట పొలాలే కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరానికి సజీవ సాక్ష్యాలని అన్నారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన ఈ ప్రాంతం నేడు రెండు పంటలతో కళకళలాడుతోందని గుర్తుచేశారు. ఆలయాల అభివృద్ధి కోసం పెద్దమ్మ గుడికి రూ.10 లక్షలు, లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రూ. 50 లక్షలు వెచ్చించినట్లు హరీశ్‌రావు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఆరు గ్యారెంటీలు, హామీలు అటకెక్కించిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు, యూరియా సకాలంలో అందేవని, కానీ.. నేడు రైతుబంధును ఎగ్గొట్టారని మండిపడ్డారు. పంట రుణమాఫీ కూడా సగమే అయిందని, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి పథకాలను నిలిపివేసి ప్రజలను కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం వెంకటాపూర్‌లోని హనుమాన్ ఆలయ వార్షికోత్సవంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. గ్రామ మహిళా రైతుల కృషిని అభినందించారు. గ్రామస్తుల కోరిక మేరకు వచ్చే వార్షికోత్సవం నాటికి ఆంజనేయ స్వామికి కిరీటాన్ని చేయించి ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ జపా శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంగౌడ్, నాయకులు ఎడ్ల సోమిరెడ్డి, కోల రమేశ్‌గౌడ్, ఎల్లంకి మహిపాల్ రెడ్డి, వేముల వెంకట్‌రెడ్డి, కూతురు రాజిరెడ్డి, బద్దిపడగ కిష్టారెడ్డి, సర్పంచ్‌లు సోమిరెడ్డి నరేశ్‌రెడ్డి, రేకులపల్లి సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.