ధర్పల్లి, ఫిబ్రవరి 27: రైతులు, ప్రజలు కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాటితో రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి, ధర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని సంతాయిపేట్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఓ శుభకార్యానికి హాజరైన ఆయన.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూరియా యాప్‌తో రైతులు నానా కష్టాలు పడుతున్నారని, యాప్‌లో యూరియా బుక్ చేసుకోవడం తెలియక మీసేవ కేంద్రాలు, ఇతర ఆన్లైన్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారని తెలిపారు.
దీంతో డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు సులభంగా యూరియా లభించేదని గుర్తుచేశారు. ఇసుకను కూడా యాప్‌లో బుక్ చేసుకోలేక పోతున్నారని, కాంగ్రెస్ నాయకులు, బడా నేతలు మాత్రం తమ పలుకుబడితో ఇసుకను సులభంగా పొందుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇసుక డంప్ చేసినా వారిపై ఎలాంటి చర్యలు లేవని, సామాన్యులకు మాత్రం వేధింపులు తప్పడం లేదన్నారు. గురుకులాల్లో నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నా.. ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేదన్నారు.
పోలీసులు, కాంగ్రెస్‌పై ఎంపీ అర్వింద్ ఘాటుగా స్పందించినప్పటికీ కాంగ్రెస్ పాలకులు మాత్రం నోరు మెదపడం లేదన్నారు. ఇది ఇరు పార్టీలు కుమ్మకయ్యారనడానికి ఇది నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. కుమ్మెర ఘటనలో చిన్నారి మృతిచెందినా.. బాధ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఖమ్మంలో పేదల ఇండ్లు కూలుస్తూ, వారిని అవమాన పర్చడం బాధాకరమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయిందని, వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్‌కు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, జిల్లా నాయకులు పీసు రాజ్‌పాల్‌రెడ్డి, నల్ల హన్మంత్‌రెడ్డి, సర్పంచ్ చెప్యాల భూమేశ్, ఉపసర్పంచులు జంగిటి చంద్రకాంత్, సురేందర్‌రెడ్డి, నాయకులు సభావత్ శ్రీనివాస్ నాయక్, నరేందర్, రాజేశ్, బీఆర్ఎస్ సిరికొండ మండల అధ్యక్షులు శ్రీనివాస్, పంతులు, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.