హనుమకొండ చౌరస్తా, జూలై 26: ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి చదరంగ పోటీలకు ఎనిమిదిమంది విద్యార్థులు ఎంపికయ్యారని చదరంగ సమాఖ్య వెల్లడించింది. ఆదివారం చెస్ సమాఖ్యం ఆధ్వర్యంలో హనుమకొండలోని మాస్టర్జీ స్కూల్లో నిర్వహించిన అండర్-13 జిల్లాస్థాయి చదరంగ పోటీల్లో ప్రతిభ కనబరిచిన నలుగురు బాలురు, నలుగురు బాలికలు రాష్ట్రస్థాయికి అర్హత సాధించారని నిర్వాహకులు తెలిపారు. చదరంగం పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరైన డాక్టర్ బి.ఏలియా, సేజ్హై స్కూల్ డైరెక్టర్ మోహన్‌రెడ్డి, జనగామ కెస్ట్ మిత్ర ఫౌండర్ మధు విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు.
చదరంగం పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం అనంతరం కార్యదర్శి కన్నా మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. అండర్-13లోబాలుర విభాగం నుంచి శ్రీసాయి ప్రీతం కనకాల, శ్రియన్ రామ్ శివరాత్రి, అక్షిత్ హన్ లావుడియా, దావల్ సాయి ఊరుగొండ.. బాలికల విభాగం నుంచి ఆద్య అనిశెట్టి, వెన్నమల్ల దిలీషా, మునిగాల అక్షర, సహస్ర కైరంకొండ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని ఆయన వెల్లడించారు. ఆగస్టులో జరగబోయే రాష్ర్టస్థాయి పోటీలకు వరంగల్ జిల్లా నుంచి ఈ ఎనిమిది ప్రాతినిధ్యం వహిస్తారని కన్నా తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్ ప్రేమ్‌సాగర్, డాక్టర్ షణ్ముఖ, కైరంకొండ రాము పాల్గొన్నారు.