నవీపేట, ఫిబ్రవరి 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్‌ను రద్దు చేసి, పాత పద్ధతి ద్వారా యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని బాసర ప్రధాన రహదారిపై మండలంలోని రాంపూర్, పొతంగల్, నవీపేట, ఫత్తేనగర్, అభంగపట్నం తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొన్నిరోజులుగా యూరియా కొరత వేధిస్తున్నదని, యూరియా పంపిణీకి ప్రభుత్వం మొబైల్ యాప్ లింక్ పెట్టడంతో తామ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు.
యూరియూ కొరతను నివారించి నూతనంగా తీసుకు వచ్చిన మొబైల్ యాప్‌ను తొలగించి పాత పద్ధతి లో యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఫర్టిలైజర్ షాపుల్లో డంపు చేసిన యూరియాను యాప్ ద్వారా జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన రైతులు ఆన్లైన్లో బుక్ చేయడంతో నవీపేట మండలంలోని రైతులకు అందడంలేదని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు.
ఫర్టిలైజర్ యాప్‌ను వెంటనే రద్దుచేసేలా ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని, నవీపేట మండలంలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏవో నవీన్‌కుమార్, తహసీల్దార్ వెంకటరమణ తమ వద్దకు రావాలని భీష్మించుకుకూర్చున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలానికి డిప్యూటీ తహసీల్దార్ రంజిత్, ఏవో నవీన్‌కుమార్, ఎస్సై యాదగిరిగౌడ్ చేరుకొని యూరియా కొరత లేకుండా చూస్తామని భరోసా ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.
ఎడపల్లి, ఫిబ్రవరి 27: ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రైతులు సొసైటీ గోదాముకు చేరుకొని నిరసన తెలిపారు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్నా అందడంలేదని వాపోయారు. తమ గ్రామ రైతులకు ఇవ్వకుండా ఇతర గ్రామాల రైతులకు పంపిణీ చేయడంపై సొసైటీ కార్యదర్శిని నిలదీశారు ఇలాగే కొనసాగిస్తే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.