జైపూర్: స్కూల్లో ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి టీచర్ల వేధింపులు కారణమని సూసైడ్ లెటర్ రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (School Boy Dies By Suicide) రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధంగడ్ కా పురా గ్రామానికి చెందిన 14 ఏళ్ల అంకిత్ గుర్జర్, కమలా భారతీయ శిక్షాణ్ సంస్థాన్‌లో 9వ తరగతి చదువుతున్నాడు.
కాగా, నవంబర్ 18న సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అంకిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి వెనుక ఉన్న పశువుల శాలలో ఉరివేసుకుని చనిపోయాడు. ఒక సూసైడ్ లెటర్ కూడా ఆ విద్యార్థి రాశాడు. ఆ రోజు స్కూల్లో టీచర్లు బాబులాల్ బైర్వా, షహన్షా షేక్‌తో పాటు స్కూల్ నిర్వాహకుడు తనను కొట్టి వేధించినట్లు ఆరోపించాడు. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో పేర్కొన్నాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ విద్యార్థి ఇంటికి చేరుకున్నారు. అంకిత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి తండ్రి మదన్ సింగ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
2 brides in a month | ఒకే నెలలో ఇద్దరు మహిళలను పెళ్లాడిన వ్యక్తి.. అరెస్ట్ చేయించిన భార్యలు
Bombay High Court | ఆత్మహత్య చేసుకుంటానని జీవిత భాగస్వామి బెదిరించడం క్రూరత్వమే: బాంబే హైకోర్టు