S Jaishankar | ఇండియా (India) పేరును భారత్ (Bharat)గా మారుస్తారన్న ప్రచారం.. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. పేరు మార్పుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉండటంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. తాజాగా ‘ఇండియా’ పేరు మార్పుపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ (S Jaishankar ) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో ‘ఇండియా’తో పాటు ‘భారత్’ అని కూడా ఉందని అన్నారు. ‘ఇండియా అంటే భారత్. మన దేశ రాజ్యాంగంలోనూ ఈ పేరు ఉంది. నా విజ్ఞప్తి ఒక్కటే. దయచేసి మన రాజ్యాంగాన్ని పూర్తిగా చదవండి. భారత్ అనే పదానికి ఓ అర్థం ఉంది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన వేళ.. ఇండియా పేరును (renaming India) భారత్‌గా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నరేంద్ర మోదీ సర్కార్ ఇండియా పేరును మార్చే ప్రతిపాదనను సభ్యుల ముందుంచనుందని తెలుస్తోంది. రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భారత్ (Bharat)గా మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతోందని.. ఇండియా పేరు మార్చుతూ సభలో తాజా తీర్మానం ఆమోదించేందుకు మోదీ సర్కార్ పావులు కదుపుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్ నుంచి జీ20 ప్రతినిధులకు అధికారిక సమాచారంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసిఉండటం పేరు మార్పు ప్రతిపాదనకు బలం చేకూరుస్తోంది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఈ లేఖను ట్వీట్ చేస్తూ ఈ వార్త నిజం కావచ్చని రాసుకొచ్చారు. దీంతో ఈ అంశం కాస్తా తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read..
Joe Biden | బైడెన్‌కి మళ్లీ కొవిడ్ నెగటివే.. జీ20 సమ్మిట్‌లో పాల్గొంటారు : వైట్ హౌస్
Parineeti-Raghav Chadha | పరిణీతి-రాఘవ్ చద్దా పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
Prime Minister Of Bharat: ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్.. దేశం పేరు మార్పుపై మరో వివాదం