PM Modi | ప్రధాని మోదీ (PM Modi) విదేశీ పర్యటనలకు (foreign trips) అయిన ఖర్చు వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. 2021 నుంచి 2024 డిసెంబర్ వరకూ ప్రధాని విదేశీ పర్యటనలకు అయిన మొత్తం ఖర్చు దాదాపు రూ.295 కోట్లు అని తెలిపింది.
విదేశీ పర్యటనలకు మోదీ వెళ్లినప్పుడు వివిధ ఏర్పాట్ల కోసం అక్కడి దౌత్య కార్యాలయాలు ఎంత ఖర్చు చేశాయో వెల్లడించాలని రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ (MP Derek O’Brien) అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ (Kirti Vardhan Singh) లిఖితూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2021-24 మధ్య ప్రధాని విదేశీ పర్యటనకు అయిన ఖర్చు రూ.295 కోట్లుగా పేర్కొన్నారు. 2025లో ఫ్రాన్స్ పర్యటనకు రూ.25 కోట్లకుపైగా ఖర్చైనట్లు తెలిపారు. ఇక 2023 జూన్‌లో ప్రధాని అమెరికా పర్యటనకు రూ.22 కోట్లకుపైగా ఖర్చైనట్లు వెల్లడించారు.
అయితే, ఈ ఏడాది మార్చిలో జరిగిన సమావేశాల్లో 2022 నుంచి 2024 డిసెంబర్ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలకు గానూ రూ.258 కోట్లు ఖర్చైనట్లు ప్రకటించింది. 2021-24 మధ్య ప్రధాని మోదీ అమెరికా, జపాన్, జర్మనీ, కువైట్, డెన్మార్క్, ఫ్రాన్స్, యూఏఈ, నేపాల్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, గ్రీస్, పోలాండ్, ఉక్రెయిన్, రష్యా, ఇటలీ, బ్రెజిల్, గయానా, బంగ్లాదేశ్, ఇటలీ, యూకేలో పర్యటించారు.
కేంద్రం పంచుకున్న డేటా ప్రకారం.. ప్రధాని 2024లో రష్యా, ఉక్రెయిన్, యూఎస్, బ్రెజిల్ సహా 16 దేశాల్లో పర్యటించారు. ఆ పర్యటనకు దాదాపు 109 కోట్లు ఖర్చైంది. అంతకు ముందు ఏడాది అంటే 2023లో ప్రధాని ఈజిప్ట్ పర్యటనకు ప్రకటనలు, ప్రసారాల కోసం దాదాపు రూ.11.90 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొంది. 2023 జూన్‌లో ప్రధాని అమెరికా పర్యటనకు రూ.22 కోట్లకుపైగా ఖర్చైనట్లు వెల్లడించారు. మొత్తం 2023లో ప్రధాని పర్యటనలకు దాదాపు రూ.93 కోట్లు ఖర్చైంది. ఇక 2022లో ప్రధాని పర్యటనలకు రూ.55.82 కోట్లు ఖర్చైంది. ఆ ఏడాది జర్మనీ (రూ. 9,44,41,562), డెన్మార్క్ (రూ. 5,47,46,921), ఫ్రాన్స్ (రూ. 1,95,03,918), నేపాల్ (రూ. 80,01,483), జపాన్ (రూ. 8,68,99,372) దేశాలన సందర్శించారు. ఇక 2021లో మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ. 36 కోట్లు. బంగ్లాదేశ్ (రూ. 1,00,71,288), అమెరికా (రూ. 19,63,27,806), ఇటలీ (రూ. 6,90,49,376), యూకే (రూ. 8,57,41,408) దేశాలను ప్రధాని సందర్శించారు.
2025లో..
ఇక ఈ ఏడాది (2025) మోదీ విదేశీ పర్యటనలు.. అమెరికా, ఫ్రాన్స్ సహా ఐదు దేశాల పర్యటనకు రూ.67 కోట్లకుపైగా ఖర్చైనట్లు అంచనా. అందులో రూ. 25,59,82,902 (ఫ్రాన్స్), రూ. 16,54,84,302 (యుఎస్), రూ. 4,92,81,208 (థాయిలాండ్), రూ. 4,46,21,690 (శ్రీలంక), రూ. 15,54,03,792.47 (సౌదీ అరేబియా)గా ఉంది. వీటితోపాటూ ఈ ఏడాది ప్రధాని మారిషన్, సైప్రస్, కెనడా, క్రొయేషియా, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో కూడా పర్యటించారు. అయితే, ఆ పర్యటనలకు సంబంధించిన ఖర్చును కేంద్రం వెల్లడించలేదు.
Also Read..
OTT platforms | అశ్లీల చిత్రాలు.. 24 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను నిషేధించిన కేంద్రం
Indian Embassy | థాయ్‌లాండ్, కాంబోడియా ఘర్షణలు తీవ్రం.. భారతీయులకు కీలక అడ్వైజరీ
EC | ఉపరాష్ట్రపతి ఎన్నిక.. రిటర్నింగ్ అధికారులను నియమించిన ఈసీ