Indian Embassy | థాయ్‌లాండ్ (Thailand), కంబోడియా (Combodia)లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దుల పొడవున అనేక ప్రాంతాల్లో ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి (Border Tensions). ఈ ఘర్షణలలో ఓ సైనికుడితోపాటు 15 మంది మరణించారు. తాజా ఉద్రిక్తతలతో భారత్ అప్రమత్తమైంది. ఈ మేరకు భారతీయుల కోసం థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) కీలక అడ్వైజరీ జారీ చేసింది. భారత పౌరులు థాయ్‌లోని ఏడు ప్రావిన్స్‌లవైపు ప్రయాణించొద్దని సూచించింది. ఉబోన్ రాట్చథాని, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కాయో, చంతబురి, ట్రూట్.. ఈ ఏడు ప్రావిన్స్‌లకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.
సరిహద్దు పొడవున ఆరు ప్రాంతాలలో ఘర్షణలు జరుగుతున్నట్లు థాయ్ రక్షణ శాఖ ప్రతినిధి సురసంత్ కాంగ్‌సిరి తెలిపారు. బుధవారం థాయ్‌లో జరిగిన మందుపాతర పేలుడు తాజా ఘర్షణలకు పురిగొల్పింది. ఈ పేలుడులో ఐదుగురు థాయ్ సైనికులు గాయపడ్డారు.ఈ మందుపాతర పేలుడుకు కంబోడియా కారణమని థాయ్ ఆరోపించగా, అది ఏనాటి మందుపాతరో అయి ఉండవచ్చని, దీంతో తమకు సంబంధం లేదని కంబోడియా జవాబిచ్చింది. ఈ నేపథ్యంలో కంబోడియాలోని తన రాయబారిని ఉపసంహరించుకున్న థాయ్ తమ దేశంలోని కంబోడియా రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది. అన్ని సరిహద్దు చెక్‌పోస్టులను మూసివేసిన థాయ్.. కంబోడియాలోని తమ పౌరులు ఆ దేశాన్ని వీడాలని పిలుపునిచ్చింది. రెండు దేశాల సైనికుల మధ్య సరిహద్దు వెంబడి శుక్రవారం తెల్లవారుజామున రెండోరోజు కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. కాంబోడియా సైన్యం భారీ ఆయుధాలను ప్రయోగించినట్టు థాయ్‌లాండ్ సైన్యం ఆరోపించింది. కాగా రెండు దేశాల సరిహద్దు వివాదం కారణంగా ఇప్పటికే ప్రజలు పెద్దఎత్తున నిరాశ్రయులయ్యారు. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది.
Also Read..
Airstrikes | థాయ్‌లాండ్, కాంబోడియా ఘర్షణలు తీవ్రం.. 15 మంది మృతి
PM Modi | బ్రిటన్ రాజుకు మొక్కను బహూకరించిన ప్రధాని మోదీ