Airstrikes : థాయ్‌లాండ్ (Thailand), కాంబోడియా (Combodia) మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. రెండు దేశాల సైనికుల మధ్య సరిహద్దు వెంబడి శుక్రవారం తెల్లవారుజామున రెండోరోజు కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. కాంబోడియా సైన్యం భారీ ఆయుధాలను ప్రయోగించినట్టు థాయ్‌లాండ్ సైన్యం ఆరోపించింది. కాగా రెండు దేశాల సరిహద్దు వివాదం కారణంగా ఇప్పటికే ప్రజలు పెద్దఎత్తున నిరాశ్రయులయ్యారు. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది.
థాయ్‌లాండ్ సైన్యం వెల్లడించిన ప్రకారం.. కాంబోడియా దళాలు ఫీల్డ్ ఆర్టిలరీ, బీఎం-21 రాకెట్ సిస్టంలను ఉపయోగించి బాంబుదాడులకు పాల్పడ్డాయి. థాయ్ దళాలు ఆ యుద్ధ వ్యూహానికి అనుగుణంగా స్పందించాయి. ఇరు దేశాల నడుము గత దశాబ్ద కాలంగా జరుగుతున్న సరిహద్దు ఘర్షణలవల్ల నాలుగు సరిహద్దు ప్రావిన్స్‌లలో 100,000 మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు 300కుపైగా తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో వారు ఆశ్రయం పొందుతున్నారు.
తాజాగా గత రెండు రోజుల నుంచి జరుగుతున్న సరిహద్దు ఘర్షణలలో మరణాల సంఖ్య 15కు చేరింది. వీరిలో 13 మంది పౌరులు, ఒక సైనికుడు ఉన్నారు. ఈ సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. తక్షణమే కాల్పుల విరమణకు ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి. థాయ్ భూభాగంపై కంబోడియా రాకెట్లు, ఆర్టిలరీని ప్రయోగించగా.. థాయ్‌లాండ్ ఎఫ్-16 ఫైటర్ జెట్లను ఉపయోగించి సరిహద్దు ఆవల సైనిక లక్ష్యాలపై దాడులకు దిగింది.
ఐదుగురు థాయ్ సైనికులు ల్యాండ్‌మైన్ పేలుడులో గాయపడ్డారు. దాంతో కాంబోడియా రాయబారిని థాయ్‌లాండ్ బహిష్కరించింది. కాగా 800 కిలోమీటర్ల సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్య దీర్ఘకాలికంగా వివాదం ఉంది. 2008 నుంచి 2011 వరకు జరిగిన ఘర్షణలలో కనీసం 28 మంది మరణించారు. వేలాది మంది నిర్వాసితులయ్యారు. 2013లో ఐక్యరాజ్యసమితి కోర్టు తీర్మానం ఈ సరిహద్దు వివాదాన్ని ఒక దశాబ్దంపాటు నియంత్రణలో ఉంచింది.
అయితే ఈ ఏడాది మే నెలలో జరిగిన ఘర్షణలో ఒక కాంబోడియా సైనికుడు మరణించాడు. దాంతో రెండు దేశాల నడుమ ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఈ రెండు దేశాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.