రామగిరి, ఫిబ్రవరి 26 : ఐదేండ్లకోమారు అమలు చేయాల్సిన వేతన సవరణను ఎనిమిదేళ్లు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదని, ఇప్పటికే 32 నెలలు గడిచినందున ఇంకా జాప్యం చేయకుండా పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని సంఘాలతో చర్చించి సమంజసమైన ఫిట్మెంట్తో 2023 జులై 1 నుండి అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన విలేకురుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని తప్పుబట్టారు. 2024 మార్చి నుండి రిటైరైన ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, డీఏ వాయిదాలను విడుదల చేయాలని కోరారు.
రాష్ట్రపతి ఉత్తర్వులు 2018కి అనుగుణంగా ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను రూపొందించి డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ తదితర పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయడం ద్వారా విద్యా శాఖలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల సిఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కేజీబీవీ, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని, గురుకులాల్లో ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అయితే ఉద్యోగులు, పెన్షనర్లపై చందా భారాన్ని తగ్గించాలని కోరారు. గురుకులాలు, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ పాఠశాలలు, కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కూడా తొలిదశలోనే ఇహెచ్ఎస్ ను అమలు చేయాలన్నారు.
టెట్ మినహాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అర్హత మార్కులను తగ్గించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి & రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాస్ చారి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎడ్ల సైదులు, ఉపాధ్యక్షురాలు బడుగు అరుణ, కోశాధికారి వడిత్య రాజు, జిల్లా కార్యదర్శులు మోర్తాల శ్రీనివాస్ రెడ్డి, నలపరాజు వెంకన్న, ఎ.చిన వెంకన్న, కొమర్రాజు సైదులు పాల్గొన్నారు.