బాక్సాఫీస్ వసూళ్ల కంటే ప్రేక్షకుల ప్రశంసలు, భావోద్వేగ అనుబంధమే తనకు మరింత సంతృప్తినిచ్చిందని అంటున్నారు యువ దర్శకుడు రవి నంబూరి. ఆయన దర్శకత్వంలో వచ్చిన హృద్యమైన ప్రేమకథ ‘చెన్నై లవ్‌స్టోరీ’. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీప్రియ జంటగా నటించిన ఈ సినిమా పదిరోజుల్లోనే 50కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవి నంబూరి సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. “బేబీ’ సినిమాకు డైరెక్టర్ సాయిరాజేశ్గారికి ఒక రచయితగా కొంచెం సహాయం చేశాను. అది గుర్తు పెట్టుకొని ఈ కథను స్వయంగా ఆయనే అందించి, నన్ను దర్శకుణ్ణి చేశారు.
సాయిరాజేశ్, ఎస్కేఎన్గార్ల రుణం ఈ జన్మకు తీర్చుకోలేను. ఈ కథలోని భావోద్వేగాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. స్క్రీన్‌ప్లే సాయిరాజేశ్, నేను కలిసే చేశాం, సంభాషణలు మాత్రం నేనే రాశాను. డైలాగ్స్‌కి వస్తున్న ప్రశంసలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి’ అని నంబూరి రవి తెలిపారు. ‘స్టీవెన్ శంకర్ పాత్రకు కిరణ్ అబ్బవరం పూర్తి న్యాయం చేశారు. సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. కథానాయిక శ్రీగౌరీప్రియ తన పాత్రకు ప్రాణం పోసింది. కథలోని భావోద్వేగాలను మరింత బలంగా నిలబెట్టింది’ అని చెప్పారు రవి నంబూరి. మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం, అనంతశ్రీరామ్ సాహిత్యం సినిమాను మరింత బలాన్ని చేకూర్చాయని, ఇంటర్వెల్ యాక్సిడెంట్ సీన్, ైక్లెమాక్స్ డాగ్ సీక్వెన్స్ మా టీమ్ మొత్తానికి పెద్ద సవాలుగా నిలిచాయని రవి నంబూరి పేర్కొన్నారు.