Sravana Masam | పవిత్ర శ్రావణ మాసం (Sravana Masam) శుక్రవారం నుంచి ప్రారంభమైంది. దీంతో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో (Srisailam) శ్రావణ మాసోత్సవాలు షురూ అయ్యాయి. వచ్చే నెల 24 వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. దీంతో భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాలు, రద్దీ రోజుల్లో అభిషేకాలను ఆలయ అధికారులు రద్దుచేశారు. ఆగస్టు 15 నుంచి 18 వరకు స్పర్శ దర్శనాలను ఆపేస్తున్నామని ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు వెల్లడించారు. మిగిలిన రోజుల్లో యథావిధిగా అభిషేకాలు, స్పర్శ దర్శనాలు కొనసాగుతాయని తెలిపారు. వచ్చే నెల 8, 22 తేదీల్లో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
శ్రావణం వచ్చిందంటే చాలు… ప్రతి ఇంట్లోనూ వ్రతాలు శ్రీకారం చుట్టుకుంటాయి. ఈ నెల అడుగుపెట్టడానికి ముందే కొత్త పెండ్లికూతుళ్లు నోములు పట్టేందుకు ప్రణాళికలు చేస్తుంటారు. మంగళగౌరిని పూజించి, వరలక్ష్మీదేవిని అర్చించి.. తమ సౌభాగ్యాన్ని కలకాలం నిలుపుకోవాలని ముత్తయిదువులు ఘనంగా నోములు చేస్తారు. ఇలా శ్రావణంలో ఆధ్మాత్మికత వెల్లివిరుస్తుంది. ఇంతటి ఆనందాన్ని ప్రజలు అందుకునేందుకు కారణమైన శ్రావణమాసం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది. సాధారణ ప్రజానీకం కూడా శ్రావణం వచ్చిందంటే శుభముహూర్తాలు వచ్చినట్లే అని భావిస్తారు.
‘నభోమాసం’ అని శ్రావణానికి పేరు. చంద్రుడు పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణం అని పేరు వచ్చింది. ఈ నెలలో సూర్యుడు కర్కాటక రాశిని విడిచి, సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. సింహ సంక్రమణం జరిగిన తర్వాత పదహారు ఘడియలు పరమ పుణ్యకాలమని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. సూర్యుడు కర్కాటక, సింహ రాశుల్లో ఉన్న సమయంలో మహానదుల్లో తప్ప ఇతర నదుల్లో స్నానం చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కాలంలో నదులకు రజస్వల దోషం ఉంటుందని శాస్త్ర వచనం.
శ్రవణం శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం. శ్రీమహావిష్ణువు అర్ధాంగి అయిన శ్రీమహాలక్ష్మిని ప్రత్యేకంగా అర్చించడం కూడా ఈ మాసంలో కనిపిస్తుంది. పరిశీలన చేస్తే లక్ష్మీదేవి, మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి వీలైన మాసం ఇది. వేదాలను కాపాడటానికి శ్రీమహావిష్ణువు హయగ్రీవునిగా అవతారం ధరించింది ఈ నెలలోనే. అందువల్ల ఈ నెలలో వేద గ్రంథ ముద్రణకు సహకరించడం పుణ్యప్రదం. కనీసం వేద విద్యార్థులకు వేద గ్రంథాలు దానం చేసినా శ్రీమహావిష్ణువును సేవించిన ఫలితం కలుగుతుందని పెద్దల మాట.
పరమేశ్వరునికి కూడా శ్రావణం ఎంతో ప్రీతికరమైనది. శ్రావణ సోమవారాల్లో మహాశివుడికి అభిషేకాలు, అర్చనలు చేయాలి. ఉత్తరాదిన శ్రావణ సోమవారాల్లో శివారాధన అత్యంత వైభవంగా చేస్తారు. కాశి, ఉజ్జయిని, సోమనాథ్ వంటి శైవక్షేత్రాలు.. శ్రావణ సోమవారాల్లో భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ రకంగా శివ కేశవ అభేదాన్ని ఈ మాసం చాటుతుంది.
శ్రావణంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజించాలని శాస్త్రం సూచించింది. ఈ ప్రకారం శ్రావణ సోమవారాల్లో పరమేశ్వరుడు; మంగళవారాల్లో గౌరీ వ్రతం లేదా అర్చనలు; బుధవారం విఠలేశ్వరుడు; గురువారాల్లో గురుదేవుడు; శుక్రవారాల్లో లక్ష్మీదేవి లేదా తులసి పూజలు; శనివారాల్లో శనీశ్వరుడు, వేంకటేశ్వరుడు, ఆంజనేయస్వామికి విశేషంగా అర్చనలు చేయాలని పేర్కొన్నారు.
శ్రావణం చంద్రుడి మాసం. జ్యోతిష శాస్త్ర రీత్యా చంద్రుడు మనసుకు కారకుడు. అంటే మనసు మీద ప్రభావాన్ని చూపించే గ్రహదేవత అన్నమాట. ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుడి కారణంగా మనుషుల మీద ప్రసరిస్తుంది. తత్ ఫలితంగా కలిగే దుష్ప్రభావాలను నివారించుకోవడానికి చంద్ర సంబంధమైన జప, తర్పణ, దాన, హోమాది కార్యక్రమాలు నిర్వహించాలి.
శ్రీకృష్ణపరమాత్మ అవతరించింది శ్రావణంలోనే. గరుత్మంతుడు అమృతభాండాన్ని సాధించింది కూడా ఈ నెలలోనే. అళవందారు, బదరీనారాయణ పెరుమాళ్, చూడికుడుత్త నాంచార్ తదితర వైష్ణవ ముఖ్యుల తిరు నక్షత్రాలు ఈ మాసంలోనే వస్తాయి. ఆధునిక యుగంలో ప్రసిద్ధి పొందిన తత్త్వవేత్త అరవిందయోగి శ్రావణంలోనే జన్మించారు. ఈ విధంగా ఎన్నో ప్రత్యేకతలతో అలరారే శ్రావణ మాస వైశిష్ట్యం ఇంత అని చెప్పటానికి సాధ్యం కాదు.
శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం: ఈ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున శ్రీరమాసహిత సత్యనారాయణస్వామి వారి వ్రతం చేయాలని చెబుతారు. స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఉన్ననాడు ఈ వ్రతం ఆచరిస్తే అత్యంత శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం.
మంగళగౌరీ వ్రతం: శ్రావణంలో ప్రతి మంగళవారం ముత్తయిదువులందరూ విధి నియమాలు, ఆచారాల ప్రకారం మంగళగౌరీ దేవిని భక్తిశ్రద్ధలతో అర్చించి, వ్రతం చేస్తారు. ప్రత్యేకించి, నూతన వధువులు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారు. దీనిని శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పాడని పురాణ కథనం. శ్రావణంలో నెల రోజులు పగటిపూట నిద్రించకూడదు. ఒక పూట మాత్రమే భోజనం చేసి, మంగళగౌరీ దేవిని అర్చిస్తే సకల శుభాలు, మాంగళ్య సౌభాగ్యం కలుగుతాయి.
శ్రీ వరలక్ష్మీ వ్రతం: శ్రావణమాసం అనగానే గుర్తుకువచ్చే వ్రతం ఇది. పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఏ కార్యానికైనా ‘సిద్ధి’ ప్రధానం. అది లేకపోతే కార్యానికి ప్రయత్నమే ఉండదు. అందుకే ‘సిద్ధి’ అనేది మొదటి లక్ష్మి. ఈ దేవత అనుగ్రహం కలిగితే కార్యభారం నుంచి విముక్తులవుతాం. ఆ ముక్తి.. ‘మోక్షలక్ష్మి’. ప్రతికూల పరిస్థితులను దాటడమే ‘జయలక్ష్మి’. కార్యసాధనకు కావలసిన తెలివితేటలు, సమయస్ఫూర్తి, నిర్ణయశక్తి, విజ్ఞానం మొదలైనవి ‘విద్యాలక్ష్మి’. అంటే ‘సరస్వతి’. ఈ సరస్వతి ఫలితంగా పొందే సంపద, ఆనందం ‘శ్రీలక్ష్మి’. దానివల్ల కలిగే శ్రేష్ఠత్వం, ఉన్నతి ‘వరలక్ష్మి’. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం ఉంది. ఈ శ్రేష్ఠత లక్ష్మీ స్వరూపం. శ్రేష్ఠమైన/ ఉన్నతమైన లక్ష్మి (సంపద)ని పొందడమే అందరికీ చివరి గమ్యం.
శుద్ధసత్త్వ రూపంతో ప్రకాశించే ఆ జగజ్జననే ‘శ్రీలక్ష్మి’. ఈమెను కొందరు అష్టలక్ష్మీ స్వరూపంగా, మరికొందరు ‘షోడశ లక్ష్మీ’ స్వరూపంగా కొలుస్తుంటారు. మన భావన ఎలా ఉన్నా ఆమె ‘అనంత లక్ష్మి’. సూర్యచంద్రుల కాంతి, అగ్నిదీప్తి, భూమి గరిమ, జలం శీతలత, క్షేత్రాల పచ్చదనం, పుష్పాల సౌందర్యం, ఫలాల శోభ, ఆరోగ్యం, ఉత్సాహం, గగన వైశాల్యం, కంఠంలో పలుకు, శరీరంలో చైతన్యం, విద్యల్లో విజ్ఞానం.. ఇలా అనంతమైన శక్తులన్నీ లక్ష్మీ స్వరూపాలే. ఇన్ని శక్తులూ మూర్తీభవించిన రూపమే ‘వరలక్ష్మి’. శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మీ దేవిని అర్చించి, శాస్త్ర నియమానుసారంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలూ సిద్ధిస్తాయి.
మొత్తంగా శ్రావణమాసం అతివలకు ముచ్చట్లు తీర్చేమాసంగా ప్రసిద్ధి పొందింది. పురుషులకు పరమాద్భుతమైన ఆధ్యాత్మిక సాధనకు పునాదిగా నిలుస్తుంది. వీటన్నిటినీ అందిపుచ్చుకుని, పరమేశ్వరుడి అనుగ్రహం కోసం చేసే తపస్సుకు శ్రావణం నాందీ వాచకంగా నిలుస్తుంది.
శ్రావణమాసం శుక్లపక్షంలో వచ్చే అన్ని రోజులూ ఎంతో విశిష్టమైనవి. ఈ రోజుల్లో ఒక్కో రోజున ఒక్కో దేవతను ప్రార్థించి, అర్చించాలనే విధి నియమాలు ఉన్నాయి. పాడ్యమి- బ్రహ్మదేవుడు; విదియ- శ్రియఃపతి; తదియ- పార్వతీదేవి; చవితి- వినాయకుడు; పంచమి- శశి (చంద్రుడు); షష్ఠి- నాగదేవతలు; సప్తమి- సూర్యుడు; అష్టమి- దుర్గాదేవి; నవమి- మాతృదేవతలు; దశమి- ధర్మరాజు; ఏకాదశి- మహర్షులు; ద్వాదశి- శ్రీమహావిష్ణువు; త్రయోదశి- అనంగుడు; చతుర్దశి – పరమేశ్వరుడు; పౌర్ణమి- పితృదేవతలు.
ఇలా ఆయా రోజుల్లో ఆయా దేవతలను అర్చిస్తే విశేషఫలితాలు కలుగుతాయని శాస్త్రం తెలియపరిచింది. వీటితోపాటు ఆయా తిథుల్లో శాస్త్రం చెప్పినట్లు మరికొన్ని ప్రత్యేక అర్చనలు చేసే విధానం ఉంది. శ్రావణంలో పాడ్యమి మొదలు పౌర్ణమి వరకు 15 రోజుల పాటు పవిత్రారోపణ ఉత్సవాలు చేయాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. పవిత్రం అంటే దర్భలతో చేసిన పొడువైన వేలి తొడుగు వంటి అమరిక. ఆయా తిథుల్లో పైన పేర్కొన్న దేవతలకు పవిత్రారోపణ ఉత్సవాలు చేయాలని శాస్త్ర వచనం.