హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12(నమస్తే తెలంగాణ) : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో దేవేరులైన గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మకు రెండు కిరీటాలు చేయించడంలో జాప్యం జరుగుతున్నది. గతంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో గత ఉత్తర్వులు పక్కనపెట్టి జనవరి 6న కిరీటాల తయారీ కోసం ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలిచారు. తయారీ కోసం తమిళనాడు కంపెనీకి ఆగమేఘాల మీద ఉత్తర్వులిచ్చిన ఉన్నతాధికారులు.. టెండర్ నోటిఫికేషన్ ఇచ్చాక మాత్రం శ్రద్ధగా చూపకపోగా ఇప్పటికీ వాటిని తెరువలేదు.
గోల్డ్‌బాండ్ స్కీమ్‌లో బంగారం ఇవ్వాలని గత ఈవోను ఒత్తిడి చేయగా వివిధ కారణాలతో రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఆ ఈవో రిటైర్ కాగా, కొత్తగా వచ్చిన ఇన్చార్జి ఈవో కూడా బంగా రం విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని వెనుకుండి నడిపిస్తున్న ముఖ్యసలహాదారు అసహనంతో ఉన్నట్టు సమాచారం. మళ్లీ తమిళనాడు కంపెనీకే అప్పగించాలని అధికారులపై గోప్యంగా ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది.