హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): నగరంలోని ప్రభుత్వ దవాఖానలకు మందులు, సర్జికల్, డయాగ్నోస్టిక్ పరికరాల సరఫరాను నిలిపివేస్తున్నట్టు ట్విన్ సిటీస్ మెడిసిన్ సప్లయర్స్ అసోసియేషన్ వెల్లడించింది. నాలుగేండ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ బిల్లులు చెల్లించడం లేదని, దీంతో తప్పని పరిస్థితుల్లో సరఫరా నిలిపివేస్తున్నట్టు అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్, పేట్లబుర్జ్, సుల్తాన్‌బజార్ ప్రసూతి, ఎంఎన్‌జే తదితర అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కలిపి సుమారు రూ.60కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సప్లయర్స్ వాపోతున్నారు.
తమ బకాయిలు విడుదల చేయాలని 2023 నుంచి ప్రభుత్వాన్ని అడుగుతున్నామని తెలిపారు. 2024లో సీఎంను కలిసి వినతి పత్రం సమర్పించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ పెండింగ్ బిల్లులను చెల్లించాలని పలుమార్లు వైద్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిశామని, డీఎంఈని అయితే ప్రతినెలా కలుస్తూనే ఉన్నామని తెలిపారు. హెల్త్ సెక్రటరీ అయితే బిల్లల విషయం తనకు సంబంధం లేదని, తన వద్దకు రావద్దంటూ దురుసుగా సమాధానం ఇచ్చారని సప్లయర్స్ మండిపడ్డారు.
బిల్లులు చెల్లించకుండా సైప్లె నిలిపివేస్తే బ్లాక్ లిస్టులో పెడుతామంటూ తమను ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక 2025 జనవరి నుంచి ఆరోగ్యశ్రీ బడ్జెట్ సైతం విడుదల చేయడం లేదని ట్విన్సిటీస్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ము ఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం కింద ఉస్మానియా, గాం ధీలో కార్డియాలజీ స్టంట్లు, కార్డియోథొరాసిక్ హార్ట్ వాల్వులు, ఆర్థోపెడిక్, స్పైన్ ఇంప్లాంట్స్, నెఫ్రాలజీ డైలైజర్స్తో చికిత్స చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ బడ్జెట్ కింద వీటిని దవాఖానలకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. మందులు, క్లినికల్, సర్జికల్ ఎక్విప్మెంట్స్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఇప్పటికే గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌కు నోటీసు ఇచ్చామని, తాజాగా ఉస్మానియాతో పాటు అన్ని దవాఖానల అధికారులకు సమాచారం ఇచ్చినట్టు సప్లయర్స్ వెల్లడించారు.
మందుల సరఫరా నిలిచిపోవడంతో ప్రభుత్వ దవాఖానల్లో రోగుల ఆరోగ్య పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనున్నది. సరఫరా పూర్తిగా నిలిచిపోతే నగరంలో ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. సుందీకరణ పనులు, అందాల పోటీలకు కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న ప్రభు త్వం రాష్ట్ర ప్రజల ప్రాణాలపై దృష్టి పెట్టకపోవడం సిగ్గుచేటని పలువురు మండిపడుతున్నారు.