న్యూఢిల్లీ: నడక సర్వరోగ నివారిణి అని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. ఇప్పుడు మరో అధ్యయనం కూడా అదే విషయాన్ని నొక్కిచెప్పింది. హృద్రోగాలు, మధుమేహం, మతిమరుపు, కుంగుబాటు వంటి వాటి కారణంగా ముందుగా చనిపోయే ముప్పును నడక తగ్గిస్తుందని తేల్చింది. రోజుకు 10 వేల అడుగుల కొలమానాన్ని 7 వేలకు తగ్గించింది. ‘లాన్సెట్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. రోజుకు 7 వేల అడుగులతో గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్, డిమెన్షియా వంటి తీవ్రమైన అనారోగ్యాల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపింది.
రోజుకు 2 వేల అడుగులు నడిచేవారితో పోలిస్తే 7 వేల అడుగులు నడిచేవారు ముందుగా చనిపోయే ప్రమాదం 47 శాతం తగ్గుతుంది. హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం 25 శాతం తగ్గుతుంది. గుండె జబ్బులతో మరణించడం 47 శాతం, క్యాన్సర్ మరణ ముప్పు 37 శాతం, డిమెన్షియా రావడం 38 శాతం, డిప్రెషన్ సమస్యలు 22 శాతం, టైప్-2 డయాబెటిస్ ముప్పు 14 శాతం తగ్గుతుందని అధ్యయనం వివరించింది.